Twitter: ట్విట్టర్ భవిష్యత్తు ఏంటో తెలియకుండా ఉంది: పరాగ్ అగర్వాల్
- ప్రస్తుతానికి ఉద్యోగుల తొలగింపు లేదు
- మస్క్ చేతికి వెళ్లిన తర్వాత ఏం జరుగుతుందో?
- ఇప్పుడే అన్నింటికీ జవాబులు లేవు
- ఉద్యోగులకు తెలిపిన పరాగ్ అగర్వాల్
ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు నేపథ్యంలో సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మస్క్ కొనుగోలు ఆఫర్ ప్రకటించిన నాటి నుంచే తమ భవిష్యత్తు ఏంటన్న ఆందోళన ట్విట్టర్ ఉద్యోగుల్లో నెలకొంది. తాజాగా ఇది మరింత పెరిగింది. దీంతో పరాగ్ అగర్వాల్ స్పందిస్తూ.. ట్విట్టర్ భవిష్యత్తు అంతుబట్టకుండా ఉందన్నారు.
ఎలాన్ మస్క్ డీల్ కు ఓకే చెప్పిన తర్వాత.. పరాగ్ అగర్వాల్ ఉద్యోగులతో మాట్లాడారు. ఉద్యోగుల తొలగింపులకు సంబంధించి ఈ సమయంలో ఇంకా ప్రణాళికలు ఏవీ లేవని స్పష్టం చేశారు. అయితే ఈ కొనుగోలు ఒప్పందం పూర్తయ్యి, సంస్థ ఎలాన్ మస్క్ చేతికి వెళ్లిన తర్వాత ఏం జరుగుతుందనేది తెలియదన్నారు. ‘‘అన్నింటికీ సమాధానాలు మా వద్ద లేవు. ఇది అనిశ్చిత కాలం’’ అని ప్రకటించారు.
ఎలాన్ మస్క్ చేతికి వెళ్లిన తర్వాత ట్విట్టర్ ఏ దిశలో వెళుతుందో ఇప్పుడే చెప్పడం కష్టమని అగర్వాల్ అభిప్రాయపడ్డారు. కొనుగోలు తర్వాత ట్విట్టర్ ప్రైవేటు సంస్థగా మారుతుందని, కంపెనీ బోర్డు రద్దయిపోతుందని ట్విట్టర్ బోర్డు చైర్మన్ బ్రెట్ టేలర్ స్పష్టం చేశారు. ‘‘ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసే సామర్థ్యాలు ట్విట్టర్ కు ఉన్నాయి. ఉద్యోగులు చేసిన కృషికి గర్వంగా ఉంది’’ అంటూ పరాగ్ అగర్వాల్, ఎలాన్ మస్క్ అంతకుముందు సంయుక్తంగా చేసిన ప్రకటనలో పేర్కొనడం గమనార్హం.