Cricket: టీమిండియాలోని అసూయాపరులైన గ్యాంగ్ నేను ఓడిపోవాలనుకుంది.. మాజీ కోచ్ రవిశాస్త్రి ఆరోపణలు
- బ్రిటన్ వార్తా సంస్థ ద గార్డియన్ కు ఇంటర్వ్యూ
- తనకేమీ లెవెల్ 1, లెవెల్ 2 బ్యాడ్జీలు లేవన్న శాస్త్రి
- తాను తోలు మందం వాడినంటూ వ్యాఖ్య
టీమిండియా జట్టుపై మాజీ కోచ్ రవి శాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. బ్రిటన్ వార్తా సంస్థ ద గార్డియన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నెన్నో ఆరోపణలు చేశాడు. కోచ్ గా తనకేమీ లెవెల్ 1, లెవెల్ 2 అంటూ బ్యాడ్జిలేవీ లేవని అన్నాడు. ఇండియా వంటి దేశంలో అసూయాపరులు ఎక్కువని, తాను కోచ్ గా ఓడిపోవాలని ఆ అసూయపూరితమైన గ్యాంగ్ కోరుకుందని సంచలన కామెంట్స్ చేశాడు.
అయితే, డ్యూక్ బంతిలాగానే తాను తోలు మందం వాడినని, దృఢంగా ఉంటానని చెప్పాడు. ఇంగ్లండ్ కోచ్ గా రాబర్ట్ కీ ఎంపికైన వేళ అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు, రాబర్ట్ తనలాగే తోలును మందంగా చేసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించాడు. కోచ్ గా లోపలికెళ్లేకొద్దీ అది రాబర్ట్ కు తెలిసొస్తుందన్నాడు.
టీమ్ కల్చర్ అనేది ఎవరికైనా ముఖ్యమని, అందుకే ఆస్ట్రేలియాను తన సొంతగడ్డపైనే టీమిండియా మట్టికరిపించగలిగిందని వ్యాఖ్యానించాడు. ఆట విషయంలో దూకుడుగా ఉండాలంటూ ప్లేయర్లకు చెప్పానన్నాడు. యాటిట్యూడ్ చాలా ముఖ్యమని వివరించాడు. ఆసీస్ తో ఆడుతున్నప్పుడు అది చాలా చాలా కీలకమన్నాడు.
ఎదుటి వాడు ఒక్క మాట అంటే.. మనం మూడు మాటలనాలంటూ జట్టు ఆటగాళ్లకు చెప్పానని గుర్తు చేశాడు. రెండుసార్లు మన భాషలో బదులిస్తే.. ఇంకోటి వారి భాషలో వారికి అర్థమయ్యేలా చెప్పాలంటూ సూచించానన్నాడు.
ఏ వార్నింగ్ లేకుండానే వచ్చేసింది..
తనకు టీమిండియా డైరెక్టర్ పదవి ఎలాంటి వార్నింగ్ లేకుండానే తన దాకా వచ్చిందని రవిశాస్త్రి వివరించాడు. 2014లో ఇంగ్లండ్ లో భారత పర్యటన సందర్భంగా ఓవల్ లో కామెంటరీ చేస్తున్న సమయంలోనే తనకు ఫోన్ వచ్చిందన్నాడు. ‘‘బీసీసీఐ నుంచి ఏడు మిస్డ్ కాల్స్ వచ్చాయి. ఏంటో అంత అర్జెంట్ అని అనుకున్నా. మీరే టీమిండియా డైరెక్టర్ అని అవతలి వాళ్లన్నారు. రేపట్నుంచే డ్యూటీ ఎక్కేయాలన్నారు. ఉన్నపళంగా రావాలన్నారు’’ అని గుర్తు చేశాడు.
తాను తన కుటుంబ సభ్యులు, వాణిజ్య భాగస్వాములతో చర్చించి చెబుతానన్నానని చెప్పాడు. వాటిని తాము చూసుకుంటామంటూ బీసీసీఐ చెప్పి తనను కోచ్ గా నియమించిందని తెలిపాడు. జీన్స్, లోఫర్స్ తో క్యాజువల్ గా ఉన్నప్పుడే తన పాత్ర మారిపోయిందని, ఇన్ స్టంట్ గా మార్పు వచ్చేసిందని చెప్పాడు.