Vidadala Rajini: సీఎం జగన్ ను కలిసిన మంత్రి విడదల రజని... రుయా ఆసుపత్రి ఘటనపై వివరణ
- తిరుపతి రుయా ఆసుపత్రిలో దారుణం
- బాలుడి మృతదేహాన్ని తరలించే క్రమంలో అంబులెన్స్ డ్రైవర్ల జులుం
- ఉచిత అంబులెన్స్ కు నిరాకరణ
- ఆసుపత్రిలో పర్యటించిన మంత్రి రజని
తిరుపతిలోని రుయా ఆసుపత్రి నుంచి ఓ బాలుడి మృతదేహాన్ని అతడి తండ్రి అతికష్టం మీద బైక్ పై 90 కిలోమీటర్లు తరలించిన ఘటన రాష్ట్రంలో ప్రకంకపనలు సృష్టిస్తోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం తీవ్రస్థాయిలో దృష్టి సారించింది. ఇప్పటికే ఆసుపత్రి అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది.
మరోపక్క, తిరుపతి రుయా ఆసుపత్రికి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించిన రాష్ట్ర ఆరోగ్య మంత్రి విడదల రజని కొద్దిసేపటి కిందట సీఎం జగన్ ను కలిశారు. రుయా ఆసుపత్రిలో చోటు చేసుకున్న విషాద ఘటనను సీఎంకు నివేదించారు. అక్కడి అంబులెన్స్ ల వ్యవస్థ గురించి తాను గమనించిన అంశాలను వివరించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు తీసుకున్న చర్యలను సీఎంకు తెలియజేశారు.
అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన ఓ బాలుడు రుయాలో ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధికి చికిత్స పొందుతూ మరణించాడు. అయితే బాలుడి మృతదేహాన్ని తమ అంబులెన్స్ ల్లోనే తరలించాలని రుయా అంబులెన్స్ డ్రైవర్లు పట్టుబట్టారు. తమ గ్రామం నుంచి ఉచిత అంబులెన్స్ వచ్చిందని బాలుడి తండ్రి చెప్పినా వారు వినిపించుకోలేదు. డబ్బు కట్టి తమ అంబులెన్స్ ల్లోనే తీసుకెళ్లాలని జులుం ప్రదర్శించారు.
కొడుకుపోయి పుట్టెడు విషాదంలో ఉన్న ఆ తండ్రి... చేతిలో డబ్బులేని పరిస్థితుల్లో కొడుకు మృతదేహాన్ని చివరికి బైక్ పై 90 కిలోమీటర్లు ప్రయాణించి స్వస్థలానికి చేర్చాడు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది.