RCB: రాయల్స్‌పై దారుణంగా ఓడిన బెంగళూరు.. అగ్రస్థానానికి రాజస్థాన్
- స్వల్ప లక్ష్య ఛేదనలో చతికిల పడిన బెంగళూరు
- ఓపెనర్‌గా వచ్చినా మారని కోహ్లీ రాత
- 29 పరుగుల తేడాతో విజయం సాధించిన రాజస్థాన్
- ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా రియాన్ పరాగ్
గత మ్యాచ్‌లో 68 పరుగులకే కుప్పకూలి ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మరోమారు పేలవ ప్రదర్శనతో ఓటమి పాలైంది. రాజస్థాన్ రాయల్స్‌తో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో ఓడింది. తొలుత బంతితో రాణించి ప్రత్యర్థిని 144 పరుగులకే కట్టడి చేసింది. ఆపై స్వల్ప లక్ష్య ఛేదనలో చతికిలపడి మరో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. అటు పరుగులు చేయలేక, ఇటు వికెట్లూ కాపాడుకోలేక పరాజయం పాలైంది. 145 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని మార్చినా ఫలితం లేకుండా పోయింది.
ఫామ్ లేమితో బాధపడుతున్న కోహ్లీ ఈసారి ఓపెనర్‌గా వచ్చినా షరా మామూలుగానే పేలవ ప్రదర్శనతో వెనుదిరిగాడు. 9 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఆ తర్వాతి నుంచి వికెట్ల పతనం కొనసాగింది. 37 పరుగుల వద్ద కెప్టెన్ డుప్లెసిస్ (23), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (0) అవుటయ్యారు. రాజస్థాన్ బౌలర్లు, ముఖ్యంగా కుల్దీప్ సేన్, ఆర్. అశ్విన్ బౌలింగ్‌లో విలవిల్లాడిన బ్యాటర్లు వరుసపెట్టి వికెట్లు సమర్పించుకున్నారు.
బెంగళూరు జట్టులో కోహ్లీ సహా ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దినేష్ కార్తీక్ (6) కూడా ఈసారి మ్యాజిక్ చేయలేకపోయాడు. ఫలితంగా మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 115 పరుగులకు బెంగళూరు ఆలౌట్ అయింది. షాబాజ్ అహ్మద్ (17), హసరంగ (18) పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో కుల్దీప్ సేన్‌కు 4 వికెట్లు దక్కగా అశ్విన్ 3, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీసుకున్నాడు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 144 పరుగులు మాత్రమే చేసింది. బెంగళూరు బౌలర్లు రాణించడంతో పరుగులు రావడం గగనమైంది. దీనికి తోడు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. రాయల్స్ జట్టులోనూ ఆరుగురు ఆటగాళ్లు రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. అయితే, రియాన్ పరాగ్ క్రీజులో పాతుకుపోయి బౌలర్లను ఎదురొడ్డడంతో 144 పరుగులు చేయగలిగింది.
పరాగ్ 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అశ్విన్ 17, శాంసన్ 27, డరిల్ మిచెల్ 16 పరుగులు చేశారు. ఈ విజయంతో రాజస్థాన్ 12 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. ఓడిన బెంగళూరు 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. అర్ధ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రియన్ పరాగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.