Donald Trump: నేను గనుక ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ఉంటే..: ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ట్రంప్
- పుతిన్ తరుచూ 'అణు' అనే పదాన్ని వాడుతున్నారన్న ట్రంప్
- ఆ పదం వాడకూడదని పుతిన్ ను గట్టిగా హెచ్చరించేవాడినని వ్యాఖ్య
- అమెరికా దగ్గర రష్యా కంటే అధికంగా ఆయుధ సంపత్తి ఉందని స్పష్టీకరణ
ఉక్రెయిన్‌పై దాడులు చేస్తోన్న రష్యాపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ తరుచూ అణు అనే పదాన్ని వాడుతున్నారని, తానే గనుక ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఆ పదం వాడకూడదని పుతిన్ ను గట్టిగా హెచ్చరించేవాడినని అన్నారు. పుతిన్ ప్రతీరోజూ అణ్వాయుధ ప్రస్తావన తీసుకొస్తుండడంతో అందరూ భయపడుతున్నారని చెప్పారు.
దీంతో ఆ భయాన్ని చూసి పుతిన్ ఆ పదాన్నే పదే పదే వాడుతూ మాట్లాడుతున్నారని చెప్పారు. అమెరికా దగ్గర రష్యా కంటే అధికంగా ఆయుధ సంపత్తి ఉందని, తాము మరింత శక్తిమంతమైన వాళ్లమని అన్నారు. ఈ విషయాన్ని తెలుసుకోవాలని తాను పుతిన్ కు గట్టిగా చెప్పేవాడినని తెలిపారు. తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు. ఉక్రెయిన్‌పై దాడిని ఆపకుంటే అమెరికా స్పందన ఎలా ఉంటుందనే విషయాన్ని గురించి తాను ఇప్పటికే పుతిన్‌కు చెప్పానని ట్రంప్ అన్నారు.