Faf du Plessis: టాస్ కోసం రెండు సార్లు కాయిన్ ను ఎగరేసిన ఫాప్ డూప్లెసిస్
- చెప్పక ముందే ఒకసారి స్పిన్
- ఆగాలని కోరడంతో చేత్తో కాయిన్ పట్టుకున్న డూప్లెసిస్
- మళ్లీ స్పిన్ చేయగా.. అతడిదే గెలుపు
టాస్ రెండోసారి వేయడం గురించి ఎప్పుడైనా విన్నామా..? తాజాగా ఈ పరిణామం చోటు చేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాప్ డూప్లెసిస్ ఇదే పనిచేశాడు. ఐపీఎల్ సీజన్ 2022లో 39వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మంగళవారం పూణెలోని ఎంసీఏ స్టేడియంలో జరిగింది.
ఈ ఏడాది ఐపీఎల్ బ్రాడ్ కాస్టర్ ప్రతినిథి నిక్ నైట్ రెండు జట్ల కెప్టెన్లు సంజు శామ్సన్, ఫాప్ డూప్లెసిస్ ను పరిచయం చేసే పనిలో ఉన్నాడు. ఈ లోపే (చెప్పక ముందే) డూప్లెసిస్ అనుకోకుండా కాయిన్ ను తిప్పి గాల్లోకి ఎగరేశాడు. అది చూసిన నిక్ నైట్ కొద్దిగ ఆగాలంటూ కోరాడు. దీంతో డూప్లెసిస్ ఎగరేసిన కాయిన్ కింద పడకుండా చేత్తో పట్టుకున్నాడు. ఆ తర్వాత తిరిగి మళ్లీ తిప్పుతూ ఎగరేశాడు. ఆశ్చర్యకరంగా టాస్ డూప్లెసిస్ నే వరించింది.