vasireddy padma: ఏపీ మహిళా కమిషన్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. విచారణకు హాజరుకానన్న బోండా ఉమ
- టీడీపీ మహిళా నేతల ఆందోళన
- ఇటీవల చంద్రబాబు, బోండా ఉమకు నోటీసులు
- నేడు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు
- 100 మంది పోలీసులతో భద్రత
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన యువతిని పరామర్శించేందుకు ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ హాస్పిటల్ వద్దకు వెళ్లగా గొడవ జరిగిన విషయం తెలిసిందే. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, టీడీపీ నేతలు అక్కడే వాగ్వివాదానికి దిగడం కలకలం రేపింది.
దీంతో తనను బెదిరించారంటూ చంద్రబాబు నాయుడు, బోండా ఉమకు వాసిరెడ్డి పద్మ నోటీసులు పంపారు. ఈ రోజు వారిద్దరు విచారణకు రావాల్సి ఉంది. అయితే, తాను విచారణకు హాజరుకావట్లేదని బోండా ఉమ ఇప్పటికే స్పష్టం చేశారు.
అలాగే, తెలుగు మహిళల ముట్టడితో గుంటూరు జిల్లా, మంగళగిరిలోని మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వంగలపూడి అనిత నేతృత్వంలో ఆందోళన కొనసాగుతోంది. ఏపీలో మహిళలపై జరిగిన దాడుల్లో ఎంత మందిపై చర్యలు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు. మహిళా కమిషన్ కార్యాలయం వద్ద భద్రత పెంచారు. 100 మంది పోలీసులతో అధికారులు భద్రత కల్పించారు.