India Postal Payments Bank: కేంద్రం దన్ను... పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు కొత్త జవసత్వాలు
- మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సమావేశం
- పోస్టల్ పేమెంట్స్ బ్యాంకును బలోపేతం చేసే దిశగా చర్యలకు నిర్ణయం
- తపాలా శాఖ ఆధ్వర్యంలోని బ్యాంకుకు రూ.820 కోట్ల సాయం
తపాలా శాఖ ఆధ్వర్యంలో ఇటీవలే కొత్తగా బ్యాంకింగ్ సేవల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇండియా పోస్టల్ పేమెంట్స్ బ్యాంకుకు కొత్త జవసత్వాలు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం మేరకు.. పోస్టల్ పేమెంట్స్ బ్యాంకుకు కేంద్రం రూ.820 కోట్లను సాయంగా అందించనుంది.
ఇటీవలే బ్యాంకింగ్ సేవలను ప్రారంభించిన తపాలా శాఖ ఇండియా పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు కొత్త బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేయించడంలో రికార్డులు నమోదు చేసింది. ఇదే ఊపుతో సాగితే... ప్రభుత్వ రంగంలోని బ్యాంకింగ్ దిగ్గజాలతో పాటు ప్రైవేట్ బ్యాంకులకు కూడా గట్టి పోటీదారు ఎదురైనట్లే. ఇదే అంశాన్ని అవగతం చేసుకున్న కేంద్రం పోస్టల్ పేమెంట్స్ బ్యాంకును మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే రూ.820 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ నిధులతో పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు మరింత సత్తాతో పనిచేయవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.