Loan Apps: లోన్ యాప్‌లపై ఈడీ నజర్... రూ.6.17 కోట్ల ఆస్తుల సీజ్
- ఫిన్ టెక్ కంపెనీకి చెందిన ఆస్తుల ఆటాచ్
- మనీ లాండరింగ్ కింద కేసు నమోదు
- పలు కంపెనీలకు చెందిన ఆస్తుల సీజ్
ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రత్యేక దృష్టి సారించింది. అడిగిన వెంటనే రుణమిచ్చేసి ఆపై అధిక వడ్డీలు బాదేస్తూ... నిర్దేశిత గడువుకు ఒక్క నిమిషం ఆలస్యమైనా రుణ గ్రహీతలను వేధింపులకు గురి చేస్తున్న లోన్ యాప్‌లపై ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ వేధింపుల కారణంగా పలువురు ఆత్మహత్యలకూ పాల్పడిన వైనం విదితమే.
తాజాగా ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఈడీ.. బుధవారం నాడు ఓ కీలక చర్యకు ఉపక్రమించింది. లోన్ యాప్ సంస్థ ఫిన్‌టెక్‌కు చెందిన రూ.6.17 కోట్ల విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసింది. అంతేకాకుండా పలు లోన్ యాప్‌లకు చెందిన ఆస్తులను కూడా అటాచ్ చేస్తూ ఈడీ చర్యలు తీసుకుంది.