coca cola: కోకాకోలా కంపెనీని కొనుగోలు చేస్తాను: ఎలాన్ మస్క్
- ఇప్పటికే ట్విట్టర్‌ను కొన్న మస్క్
- కోకాకోలా గురించి తాజాగా ట్వీట్
- కొకైన్‌ను కోకా కోలాకు తిరిగి చేరుస్తానని వ్యాఖ్య
ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇప్పుడు కోకాకోలా కంపెనీని కొనుగోలు చేయనున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కోకాకోలా అనేక దేశాల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఈ కంపెనీని కొనుగోలు చేసి ఇల్లీగల్ డ్రగ్‌గా పేరున్న కొకైన్‌ను కోకా కోలాకు తిరిగి చేరుస్తానని కూడా మస్క్ తన ట్వీట్ లో పేర్కొనడం గమనార్హం.
కోకా కోలా కూల్ డ్రింక్‌లో కోకా ఆకులు, కోలా గింజలు ఉండేవి. కోకా ఆకుల నుంచి సైకోయాక్టివ్ డ్రగ్ కొకైన్ వస్తుంది. అప్పట్లో కోకా కోలా కూల్ డ్రింక్ అధికంగా కోకా ఆకుల మీదే ఆధారపడేది. ఆ రోజుల్లో కొకైన్‌ను ఔషధంగా పరిగణించినప్పటికీ, చివరకు నిషేధిత జాబితాలో చేర్చారు. అమెరికా కూడా దానిని నిషేధించడంతో కోకా కోలా నుంచి కోకా ఆకులు దూరమై అందుకు బదులుగా డీకోకైనైజ్డ్ కోకా ఆకులు వచ్చాయి.
ఈ నేపథ్యంలో మస్క్ కోకా కోలాకు తిరిగి కొకైన్ ను తీసుకొస్తానంటూ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఇప్పటికే ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ 44 బిలియన్లకు కొనుగోలు చేశారు. ఆ సంస్థ ఒక్కో షేరును 54.20 డాలర్లకు కొన్నారు.