Somu Veerraju: నీ సొంత పార్టీ నేతలు అయినంత మాత్రాన చర్యలు ఉండవా?: సీఎం జగన్ పై సోము వీర్రాజు ధ్వజం
- కాకినాడ జిల్లాలో ఘటన
- తమ భూమిని ఆక్రమించారంటూ రైతు కుటుంబం ఆందోళన
- జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం
- మంత్రి దాడిశెట్టి రాజా అనుచరుల కబ్జా అంటూ ఆరోపణ
మంత్రి దాడిశెట్టి రాజా ప్రోత్సాహంతో ఆయన అనుచరులు తమ భూమిని ఆక్రమించుకున్నారంటూ ఓ రైతు కుటుంబం కాకినాడ కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగడం తెలిసిందే. ఈ రైతు కుటుంబం తమ పశువును కూడా కలెక్టర్ కార్యాలయం ఎదుట కట్టేసి నిరసనకు దిగింది. అంతేకాదు, ఆ రైతు కుటుంబ సభ్యులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ మేరకు ఓ పత్రికలో కథనం వచ్చిన నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు.
మంత్రి అనుచరులే దందా చేస్తున్నారని మీడియా కోడై కూస్తోందని అన్నారు. స్వయానా బాధిత కుటుంబం రోడ్డునపడి కలెక్టరేట్ ముందు ఆత్మహత్యాయత్నం చేస్తుంటే నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిద్రపోతోందా? నీ సొంత పార్టీ నేతలు అయినంత మాత్రాన చర్యలు ఉండవా? అంటూ సోము వీర్రాజు సీఎం జగన్ పై ధ్వజమెత్తారు.
ఈ వ్యవహారంలో తక్షణమే సీఎం జగన్ స్పందించి ఘటనకు కారకులపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 'అధికార దర్పాన్ని ప్రదర్శించి అమాయక రైతుల భూముల కబ్జా చేయాలని చూస్తే ప్రతిఘటన తప్పదు జగన్ గారూ' అంటూ సోము వీర్రాజు హెచ్చరించారు.