TDP: నర్సింగ్ గ్రాడ్యుయేట్ల పోరాటానికి నారా లోకేశ్ మద్దతు
- నర్సింగ్ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్
- 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్ చేసిన వారికి అవకాశం లేదు
- సీపీసీహెచ్ కోర్సు లేదనే సాకుతో అవకాశం నిరాకరణ
- నారా లోకేశ్‌ను కలిసిన నర్సింగ్ గ్రాడ్యుయేట్లు
- పోరాటానికి పూర్తిగా మద్దతు ఇస్తామని లోకేశ్ హామీ
ఉద్యోగ నియామకాల్లో తమకు జరుగుతున్న అన్యాయంపై పోరాటానికి సిద్ధమైన నర్సింగ్ గ్రాడ్యుయేట్లకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు గురువారం రాత్రి తనను కలిసిన నర్సింగ్ గ్రాడ్యుయేట్లతో మాట్లాడిన నారా లోకేశ్.. వారి పోరాటానికి టీడీపీ దన్నుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
నర్సింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి తాజాగా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లకు అవకాశం లేదని, తాజా నోటిఫికేషన్‌లో సీపీసీహెచ్ కోర్సు లేదనే సాకుతో తమను అనర్హులుగా చేసి 2021 తరువాత బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేసిన వారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారని గ్రాడ్యుయేట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై గురువారం నాడు నారా లోకేశ్‌ను కలిసిన నర్సింగ్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాల భర్తీలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. నియామకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. నర్సింగ్ గ్రాడ్యుయేట్లు చేస్తున్న పోరాటానికి పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని.. వారి న్యాయ పోరాటానికి సహాయం అందిస్తామని లోకేశ్ తెలిపారు.