Mantena Ramaraju: టీడీపీ ఎమ్మెల్యేను ఆహ్వానించి.. వైసీపీ నేతలతో ప్రారంభోత్సవం చేయించిన అధికారులు
- వరికోత యంత్రం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే రామరాజుకు ఆహ్వానం
- ఆయన రాకముందే వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌తో ప్రారంభోత్సవం
- పిలిచి అవమానిస్తారా? అంటూ ఎమ్మెల్యే ఆగ్రహం
ఓ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీడీడీ ఎమ్మెల్యేను ఆహ్వానించిన అధికారులు కొంచెం తొందరపడ్డారు. ఆయన రావడానికి ముందే ఎంచక్కా వైసీపీ నేతలతో ప్రారంభోత్సవం చేయించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరికోత యంత్రం ప్రారంభోత్సవానికి రావాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రామరాజును వ్యవసాయశాఖ అధికారులు ఆహ్వానించారు. దీంతో ఆయన నిన్న ఉదయం 9.41 గంటలకు ఉండిలోని విత్తనాభివృద్ధి క్షేత్రానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తయిందని, వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ గోకరాజు రామరాజు, ఇతర నాయకులు ప్రారంభించినట్టు తెలుసుకున్నారు.
దీంతో అధికారులను కలిసిన ఎమ్మెల్యే రామరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిలిచి అవమానించడం ఏంటని నిలదీశారు. ప్రొటోకాల్ సంగతేంటని ఏడీఏ అనిల్ కుమారి, ఏవో బి.సంధ్యలను ప్రశ్నించారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్‌ను గాలికొదిలేసిన ఘటనలు నియోజకవర్గంలో గతంలోనూ పలుమార్లు జరిగాయన్నారు. పై అధికారులకు ఫిర్యాదు చేస్తే అధికారులు వచ్చి క్షమించమంటే వదిలేశానని అన్నారు. తిరిగి మరోసారి పిలిచి అవమానించారని మండిపడ్డారు. దీనిపైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని రామరాజు తెలిపారు.