SBI: 31 పైసలు డ్యూ ఉన్నాడట.. రైతుకు నో డ్యూ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఎస్‌బీఐ నిరాకరణ

Guj HC raps SBI for denying no dues certificate in land deal matter

  • ఎస్‌బీఐ తీరుపై గుజరాత్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం
  • 50 పైసల కంటే తక్కువ బకాయి ఉంటే దానిని లెక్కల్లోకి తీసుకోరన్న న్యాయస్థానం
  • కోర్టుకు రావాలంటూ బ్యాంకు మేనేజర్‌కు ఆదేశం

కేవలం 31 పైసలు బాకీ ఉన్నాడన్న నెపంతో ఓ రైతుకు నో డ్యూ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ). గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఈ ఘటన చివరికి హైకోర్టుకు చేరింది. వివరాల్లోకి వెళ్తే..  ఖోరజ్ గ్రామానికి చెందిన శ్యాంజీ భాయ్ అనే రైతు 2020లో తన భూమిని ఇద్దరు వ్యక్తులకు విక్రయించాడు. అయితే, ఈ భూమి విక్రయానికి ముందు ఎస్‌బీఐ నుంచి రూ. 3 లక్షల రుణం తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ రుణాన్ని చెల్లించాడు.

అనంతరం ఆ భూమిని ఇద్దరు వ్యక్తులకు విక్రయించాడు. అయితే, కొనుగోలు చేసిన వ్యక్తుల పేర్లపై ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించాలంటే ఎస్‌బీఐ నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించినట్టు నో డ్యూ సర్టిఫికెట్ కావాలని అధికారులు చెప్పారు. దీంతో శ్యాంజీ ఎస్‌బీఐకి వెళ్లగా 31 పైసలు ఇంకా చెల్లించాల్సి ఉందని, కాబట్టి సర్టిఫికెట్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు. దీంతో ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు.

నిన్న ఈ కేసు విచారణకు రాగా, ఎస్‌బీఐ తరపు న్యాయవాది చెప్పింది విని కోర్టు ఆశ్చర్యపోయింది. రైతు శ్యాంజీ తాను తీసుకున్న రుణంలో ఇంకా 31 పైసలు చెల్లించాల్సి ఉందని, అందుకే నో డ్యూ సర్టిఫికెట్ జారీ కాలేదని చెప్పారు. అది విన్న కోర్టు ఆశ్చర్యపోయింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం 50 పైసల కంటే తక్కువ ఉన్నదాన్ని లెక్కలోకి తీసుకోకూడదని, తీసుకున్న రుణం మొత్తాన్ని చెల్లించినా నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వలేదంటే అది వేధించడమే అవుతుందని పేర్కొంది. బ్యాంకు మేనేజర్‌ కోర్టుకు హాజరుకావాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News