hours: రోజుకు ఏడు గంటల నిద్రతో మంచి ఫలితాలు: కేంబ్రిడ్స్ వర్సిటీ పరిశోధన
- కాగ్నిటివ్ పనితీరు చక్కగా
- ఎక్కువ నిద్ర, తక్కువ నిద్రతో నష్టం
- వృద్దాప్యంలో నిద్ర తగినంత ఉండాల్సిందే
రోజుకు ఎన్ని గంటలు ఆరోగ్యానికి మంచిది? ఈ సందేహానికి సరియైన సమాధానం రాదు. తలా ఒకటి చెబుతుంటారు. పరిశోధనల్లో కూడా ఇలాంటి వైరుధ్యాలు కనిపిస్తాయి. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఫుడాన్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనం 7 గంటల నిద్రతో మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతోంది. మధ్య వయసు, పెద్ద వయసు వారికి రోజులో 7 గంటలు నిద్ర చక్కగా సరిపోతుందని వీరు తెలుసుకున్నారు. తక్కువ నిద్రపోయే వారు, అంత తెలివిగా, చురుగ్గా ఉండలేకపోతున్నారు. 7 గంటల పాటు నిద్రపోయే వారితో పోలిస్తే తక్కువ నిద్రించే వారిలో మానసిక ఆరోగ్యం కూడా బాగోవడం లేదని పరిశోధనలో తెలిసింది.
చక్కని మానసిక ఆరోగ్యం విషయంలో మెదడులోని కాగ్నిటివ్ పనితీరు ముఖ్య పాత్ర పోషిస్తోంది. మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ నిద్రా సమయాలు మారిపోవడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు వృద్దాప్యంలో కనిపిస్తాయి. నేచుర్ ఏజింగ్ పత్రికలో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. 38-73 ఏళ్ల మధ్య వయసున్న ఐదు లక్షల మందిపై అధ్యయనం ద్వారా ఈ ఫలితాలు తెలిశాయి.. తగినంత నిద్ర లేకపోయినా.. అధికంగా నిద్రపోయినా అది కాగ్నిటివ్ పనితీరుపై ప్రభావం చూపిస్తున్నట్టు పరిశోధకులు తెలుసుకున్నారు.