traffic: హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

traffic restrictions in hyd

  • ఎల్బీ స్టేడియంలో ప్ర‌భుత్వం ఇఫ్తార్ విందు
  • ఆ ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ మ‌ళ్లింపులు
  • నేడు రంజాన్ చివ‌రి శుక్ర‌వారం ప్రార్థ‌న‌లు 
  • మ‌క్కామ‌సీదు, సికింద్రాబాద్‌లోనూ ట్రాఫిక్ ఆంక్ష‌లు

రంజాన్ సంద‌ర్భంగా ముస్లింలకు తెలంగాణ‌ ప్రభుత్వం తరఫున ఈ రోజు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఇస్తున్నారు. సీఎం కేసీఆర్ తో పాటు ప‌లువురు మంత్రులు, అధికారులు కూడా ఈ విందుకు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. నేటి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మ‌ళ్లిస్తున్న‌ట్లు పోలీసులు చెప్పారు. 

హైదరాబాద్ ట్రాఫిక్ సంయుక్త సీపీ రంగనాథ్ మీడియాకు వివ‌రాలు తెలిపారు. ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు, మత పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందని, ఈ నేప‌థ్యంలోనే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకూడ‌ద‌న్న ఉద్దేశంతో వాహనాలను దారి మళ్లించనున్నట్లు చెప్పారు.  

ఎల్బీ స్టేడియం మీదుగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. చాపెల్‌ రోడ్డు, నాంపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలకు బీజేఆర్‌ విగ్రహం వైపున‌కు అనుమతి ఉండదు. ఆయా మార్గాల నుంచి వచ్చే వాహ‌నాల‌ను ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద పీసీఆర్‌ వైపు మళ్లిస్తారు. అలాగే, ఎస్‌బీఐ గన్ ఫౌండ్రి వైపు నుంచి ప్రెస్ క్లబ్‌, బషీర్‌బాగ్‌ ఫ్లై ఓవర్‌ వైపు వాహనాలకు అనుమతి ఉండదు. వాటిని ఎస్‌బీఐ వద్ద చాపల్‌ రోడ్డులోకి మళ్లిస్తారు. 

రవీంద్ర భారతి, హిల్ పోర్టు నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు వెళ్ల‌కుండా కేఆర్‌కే బిల్డింగ్‌ వద్ద సుజాత హైస్కూల్‌ రూట్‌లోకి వాహ‌నాల‌ను దారి మ‌ళ్లిస్తారు.  అలాగే, నారాయణగూడ సిమెట్రీ వైపు నుంచి బషీర్‌బాగ్‌ వచ్చే వాహనాలను ఓల్డ్‌ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌ వైపు మళ్లిస్తారు. 

మ‌రోవైపు, కింగ్ కోఠి, బొగ్గులకుంట నుంచి బషీర్ బాగ్‌ వైపు భారతీయ విద్యా భవన్‌ మీదుగా వచ్చే వాహ‌నాల‌ను కింగ్ కోఠి ఎక్స్‌ రోడ్స్‌లోని తాజ్‌మహల్ హోట‌ల్, ఈడెన్‌ గార్డెన్‌ వైపు దారి పంపిస్తారు. బషీర్‌బాగ్‌ నుంచి పీసీఆర్‌ వైపునకు వాహనాల అనుమతి ఉండదు. ఈ వాహనాలను లిబర్టీ వైపు మళ్లిస్తారు. 

మ‌రోవైపు, రంజాన్‌ చివరి శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో చార్మినార్‌, మక్కామసీద్‌, సికింద్రాబాద్‌లోని జమే ఈ మసీద్‌ పరిసరాల్లో కూడా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. చార్మినార్‌ నుంచి మదీనా, చార్మినార్‌, ముర్గీ చౌక్‌, రాజేశ్‌ మెడికల్‌ హాల్‌, శాలిబండ రోడ్లను మధ్యాహ్నం 3 గంటల వరకు మూసివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మదీనా జంక్షన్ వ‌ద్ద కూడా ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. 

మ‌సీదులో ప్రార్థనలకు వచ్చే వారి వాహనాలకు గుల్జార్‌ ఫంక్షన్‌ హాల్‌, ముఫీద్‌ ఉల్‌ అనామ్‌ గ్రౌండ్‌, చార్మినార్‌ బస్‌ టర్మినల్‌ , ఆయుర్వేద యూనానీ హాస్పిటల్‌, కిల్వత్‌ గ్రౌండ్‌, ఓల్డ్‌ పెన్షన్‌ ఆఫీస్‌, సర్దార్‌ మాల్‌, జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌ పార్కింగ్‌ స్థలాలను కేటాయించారు. అలాగే, సికింద్రాబాద్‌లోని సుభాష్‌ రోడ్డును ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసివేస్తారు. బాటా ఎక్స్‌రోడ్స్‌ నుంచి సుభాష్‌ రోడ్డులోకి వచ్చే వాహనాలను మహంకాళి పీఎస్‌ వద్ద లాలా టెంపుల్‌ వైపు మళ్లిస్తున్నారు.

  • Loading...

More Telugu News