Hyderabad: వరకట్న వేధింపులు.. కూకట్ పల్లిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య!
- గత ఏడాది సిరిసిల్లకు చెందిన ఉదయ్ తో నిఖిత పెళ్లి
- రూ. 10 లక్షల నగదు, 35 తులాల బంగారాన్ని కట్నంగా ఇచ్చిన వైనం
- నిఖిత తండ్రి పేరిట ఉన్న 4 ఎకరాల భూమిని ఇవ్వాలని వేధించిన భర్త
హైదరాబాద్ లో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వరకట్న వేధింపులకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న ఓ మహిళ బలైంది. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలకృష్ణ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సిరిసిల్లకు చెందిన ఐటీ ఉద్యోగి ఉదయ్ తో గత ఏడాది నిఖితకు పెళ్లి జరిగింది. వివాహ సమయంలో రూ. 10 లక్షల నగదుతో పాటు 35 తులాల బంగారాన్ని నిఖిత తల్లిదండ్రులు కట్నంగా ఇచ్చారు.
పెళ్లైన కొన్ని నెలల తర్వాత నిఖితను ఉదయ్ వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. నిఖిత తండ్రి పేరిట ఉన్న 4 ఎకరాల భూమిని తనకు ఇవ్వాలని వేధింపులకు గురి చేశాడు. వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో నిఖిత తల్లిదండ్రులు నిఖిత మృతదేహాన్ని సిరిసిల్లకు తీసుకెళ్లి... ఉదయ్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఉదయ్ ని, అతని కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ రెండు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది.