Prathipati Pulla Rao: ఏపీలో ఉన్న వాస్తవ పరిస్థితులనే కేటీఆర్ చెప్పారు: ప్రత్తిపాటి పుల్లారావు
- ఏపీలో కరెంట్, నీళ్లు లేవన్న కేటీఆర్
- ఏపీ విధ్వంసం కేసీఆర్, జగన్ ఆధ్వర్యంలోనే జరిగాయన్న ప్రత్తిపాటి
- ఏపీలో భూముల ధరలు 200 శాతం పడిపోయాయని వ్యాఖ్య
ఏపీలో కరెంట్, నీళ్లు లేవని, రోడ్లు ధ్వంసమయ్యాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో కాక పుట్టిస్తున్నాయి. వైసీపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి, మల్లాది విష్ణు, జోగి రమేశ్ లు కేటీఆర్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, ఏపీలో ఉన్న వాస్తవ పరిస్థితులనే కేటీఆర్ చెప్పారని అన్నారు. ఒక్క తెలంగాణ మాత్రమే కాదని... దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ గొప్పను చాటుకునేందుకు ఏపీతో పోల్చుకుంటున్నాయని చెప్పారు.
అయితే తెలంగాణ అభివృద్ధి, ఏపీ విధ్వంసం ఇవి రెండూ కేసీఆర్, జగన్ ల ఆధ్వర్యంలోనే జరిగాయని ప్రత్తిపాటి ఆరోపించారు. ఏపీలో భూముల ధరలు 200 శాతం పడిపోయాయని, ఇదే సమయంలో తెలంగాణలో రేట్లు గణనీయంగా పెరిగాయని చెప్పారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని, పరిశ్రమలు మూతపడ్డాయని, ఏ మాత్రం అభివృద్ధి జరగలేదని... అందుకే అందరూ తెలంగాణ సురక్షితమని అనుకుంటున్నారని అన్నారు.