YSRCP: ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్ అభివృద్ధి... కేటీఆర్ వ్యాఖ్యలపై సజ్జల స్పందన
- పీవీ హైవే వైఎస్ హయాంలో నిర్మించిందే
- ఏపీకి రాజధాని లేకుండా విభజన చేశారు
- విభజన తర్వాత ఆస్తుల పంపకాలు ఇంకా పూర్తి కాలేదు
- మొన్నటి వరకు తెలంగాణలోనూ విద్యుత్ కోతలున్నాయన్న సజ్జల
ఏపీలో మౌలిక వసతులు అధ్వానంగా ఉన్నాయన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలను రాజకీయం చేయదలచుకోలేదన్న సజ్జల.. ఎవరైనా ముందుగా తమ రాష్ట్రం గురించి చెప్పుకోవాలని, ఆ తర్వాత ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడాలని హితవు పలికారు.
"మొన్నటివరకు తెలంగాణలోనూ విద్యుత్ కోతలున్నాయి. రోడ్లు కూడా బాగా లేవు. విభజన తర్వాత ఆస్తుల పంపకాలు ఇంకా పూర్తి కాలేదు. సుమారు 50 నుంచి 60 వేల కోట్ల ఆస్తుల విభజన జరగాల్సి ఉంది. ఏపీకి రాజధాని లేకుండా విభజించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందింది. పీవీ హైవే కూడా వైఎస్ హయాంలో నిర్మించిందే" అని సజ్జల వ్యాఖ్యానించారు.