Lucknow Super Giants: సమష్టిగా చెలరేగిన లక్నో.. ఐదో ఓటమి చవిచూసిన పంజాబ్ కింగ్స్

Chameera Mohsin and Krunal help LSG defend 153

  • లక్ష్య ఛేదనలో విఫలమైన పంజాబ్ కింగ్స్
  • ఓ మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకున్న లక్నో
  • 12 పాయింట్లతో మూడో స్థానానికి రాహుల్ సేన
  • ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా కృనాల్ పాండ్యా

వరుస పరాజయాలతో సతమతమవుతున్న పంజాబ్ సూపర్ కింగ్స్ మరోమారు పేలవ ప్రదర్శనతో ఓటమి పాలైంది. బలమైన బ్యాటింగ్ లైన్ కలిగి ఉన్న పంజాబ్ 154 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక 113 పరుగులకే చతికిలపడింది. ఫలితంగా 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత పంజాబ్ బౌలర్లు రాణించి 153 పరుగులకే లక్నోను కట్టడిచేశారు. అయితే, బ్యాటర్లు మరోమారు చేతులెత్తేశారు. బెయిర్‌స్టో చేసిన 32 పరుగులే జట్టులో వ్యక్తిగత అత్యధిక స్కోరు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 25, రిషి ధావన్ 21, లియామ్ లివింగ్ స్టోన్ 18 పరుగులు చేశారు. ఐదుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కూడా దాటలేకపోయారు. ఫలితంగా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసి విజయానికి 21 పరుగుల దూరంలో నిలిచింది. లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్ 3, దుష్మంత చమీర, కృనాల్ పాండ్యా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేసింది. కగిసో రబడ బంతితో నిప్పులు చెరగడంతో లక్నో వరుసపెట్టి వికెట్లు కోల్పోయింది. అయితే, క్వింటన్ డికాక్ (46), దీపక్ హుడా (34) రాణించారు. చివర్లో చమీర 17, మోసిన్ ఖాన్ 13 పరుగులు చేయడంతో లక్నో ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. పంజాబ్ బౌలర్లలో రబడ 4 వికెట్లతో లక్నో జట్టును హడలెత్తించాడు. రాహుల్ చాహర్ 2, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు. ఎల్‌ఎస్‌జీ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ విజయంతో లక్నో 12 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది. పంజాబ్ ఐదు ఓటములతో నాలుగో స్థానంలో ఉంది. ఐపీఎల్‌లో నేడు గుజరాత్ టైటాన్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడతాయి.

  • Loading...

More Telugu News