Eluru District: వైసీపీ ఎమ్మెల్యేపై సొంత పార్టీ కార్యకర్తల దాడి.. తలారి వెంకట్రావుకు గాయాలు
- ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో ఘటన
- వైసీపీ గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్ దారుణ హత్య
- వ్యతిరేక వర్గమే ఈ దారుణానికి పాల్పడిందని ప్రసాద్ వర్గం అనుమానం
- ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావు
- ఒక్కసారిగా ఎమ్మెల్యేపై దాడికి దిగిన గ్రామస్తులు
- దాడిలో ఎమ్మెల్యేకు గాయాలు
- అతికష్టం మీద ఎమ్మెల్యేను అక్కడి నుంచి తరలించిన పోలీసులు
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండల పరిధిలోని జి.కొత్తపల్లిలో శనివారం ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి వచ్చిన వైసీపీ నేత, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై సొంత పార్టీ కార్యకర్తలే దాడికి దిగారు. ఎమ్మెల్యేను వైసీపీ కార్యకర్తల దాడి నుంచి రక్షించేందుకు పోలీసులు తీవ్రంగా యత్నించినా... గ్రామస్తులంతా ఒక్కసారిగా మీద పడటంతో ఎమ్మెల్యే వారి చేతిలో దెబ్బలు తినక తప్పలేదు. ఆ తర్వాత అతి కష్టం మీద పోలీసులు ఎమ్మెల్యేను గ్రామస్తుల బారి నుంచి తప్పించినా... అప్పటికే గ్రామస్తుల దాడిలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు గాయాలయ్యాయి.
ఈ ఘటనకు దారి తీసిన వివరాల్లోకెళితే... జి.కొత్తపల్లి వైసీపీలో రెండు వర్గాలు ఉన్నాయి. వైసీపీ గ్రామ అధ్యక్షుడిగా ఉన్న గంజి ప్రసాద్ శనివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. గ్రామంలోని ప్రసాద్ వ్యతిరేక వర్గమే ఆయనను హత్య చేయించిందని అతడి వర్గీయులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా ప్రసాద్ వ్యతిరేక వర్గాన్ని స్వయంగా ఎమ్మెల్యే ప్రోత్సహించారని కూడా అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రసాద్ హత్య గురించిన సమాచారం అందుకున్న వెంటనే ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గ్రామానికి వెళ్లారు.
అప్పటికే ప్రసాద్ మృతి నేపథ్యంలో వ్యతిరేక వర్గంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న మృతుడి వర్గీయులు... ఎమ్మెల్యేను చూడగానే ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఎమ్మెల్యేపై మూకుమ్మడిగా దాడికి దిగారు. పోలీసులు అడ్డుకుంటున్నా... గ్రామస్తులు ఏమాత్రం తగ్గలేదు. ఒకానొక దశలో పోలీసులను తోసేసి మరీ ఎమ్మెల్యేపై గ్రామస్తులు దాడికి దిగారు. పరిస్థితి విషమిస్తోందని తెలుసుకున్న పోలీసులు మరింతగా శ్రమించి ఎలాగోలా ఎమ్మెల్యేను గ్రామస్తుల బారి నుంచి పక్కకు తప్పించారు.