- అటువంటి వారికి ‘హిందుస్థాన్’లో చోటు లేదు
- ఈ దేశంలో ఉండాలంటే హిందీని ప్రేమించాల్సిందే
- లేదంటే వారిని విదేశీయులుగానే చూస్తాం
- మంత్రి సంజాయ్ నిషాద్ హెచ్చరిక
ఉత్తరప్రదేశ్ మత్స్య శాఖ మంత్రి సంజయ్ నిషాద్ హిందీయేతరులను ఉద్దేశించి అనుచితంగా, హెచ్చరికగా మాట్లాడారు. హిందీని ప్రేమించలేని వారిని విదేశీయులుగా పరిగణిస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారు. హిందీ మాట్లాడలేని వారు ఈ దేశాన్ని విడిచి పోవాలంటూ వివాదాన్ని రాజేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
యూపీలో బీజేపీ భాగస్వామ్య పక్షం ‘నిషాద్’ చీఫ్ గా సంజయ్ నిషాద్ వ్యవహరిస్తున్నారు. ‘‘భారత్ లో ఉండాలనుకుంటే హిందీని ప్రేమించాల్సిందే. ఇష్టపడకపోతే మిమ్మల్ని విదేశీయులుగా లేదంటే విదేశీ శక్తులతో చేతులు కలిపిన వారిగా భావించాల్సి వస్తుంది. ప్రాంతీయ భాషలను మేము గౌరవిస్తాం. కానీ ఈ దేశం ఒక్కటే. భారత రాజ్యాంగం ఇండియాను హిందుస్థాన్ గా చెబుతోంది. అంటే హిందీ మాట్లాడేవారి దేశం అని’’అంటూ లక్నోలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా అన్నారు.
ప్రాంతీయ భాషలను తాను ఎందుకు గౌరవించాలి? అని ప్రశ్నించారు. ‘‘చట్టం ప్రకారం హిందీ జాతీయ భాష. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి. అతడు ఎంత పెద్ద వాడైనా సరే. కొందరు హిందీ మాట్లాడడానికి నిరాకరిస్తూ వాతావరణాన్ని చెడగొడుతున్నారు. వారికి ప్రజలే తగిన సమాధానం ఇస్తారు’’అని పేర్కొన్నారు.