- 18-44 వయసులో 66 లక్షల మందికి అర్హత
- తీసుకున్నది లక్ష మందే
- 45-59 వయసులోని వారు 3.55 కోట్ల మంది
- ముందుకు వచ్చిన వారు 3.65 లక్షల మందే
కరోనా రక్షక టీకాలు 2021 ప్రారంభం నుంచి వృద్ధులకు అందుబాటులోకి వచ్చాయి. అయినా ముందుకు వచ్చి తీసుకున్న వారు చాలా కొద్ది మందే. అదే ఏడాది ఏప్రిల్ నాటికి కరోనా రెండో విడత ఉగ్రరూపం దాల్చడం.. కేసులు భారీగా నమోదు కావడం, ఆక్సిజన్ కొరతతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం చూసిన తర్వాత కానీ వారిలో చలనం రాలేదు. పెద్ద ఎత్తున టీకాలు తీసుకునేందుకు ముందుకు వచ్చారు. దాంతో అధిక శాతం మందికి విజయవంతంగా రెండు డోసుల టీకాలు ఇవ్వడం పూర్తయింది.
మూడో డోసు (ప్రికాషనరీ/బూస్టర్) కు వచ్చే సరికి ప్రజల నుంచి ఆసక్తి కరువైంది. కరోనా మూడో విడత ఒమిక్రాన్ రూపంలో కనిపించినా, ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది అతి కొద్ది మందికే. దీంతో ఇక కరోనా ఏమీ చేయలేదన్న నమ్మకం ఏర్పడినట్టుంది. దీనికి నిదర్శనం 18-44 వయసులోని వారు 66 లక్షల మందికి అర్హత ఉంటే, మూడో డోసు తీసుకున్నది లక్ష మందే. 45-59 మధ్య వయసులోని వారు 3.55 కోట్ల మంది ఉంటే, 3.65 లక్షల మందే మూడో డోసు తీసుకున్నారు.
‘‘ఇది ఆత్మసంతృప్తి లేదా నిర్లక్ష్యం కావచ్చు. ఎక్కువ మంది ప్రజలకు రెండు డోసుల టీకా ఇవ్వడం ముగిసింది. దీనికితోడు కరోనా కేసులు కొద్దిగానే ఉండడంతో ఎక్కువ మంది టీకాకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. అంతా బాగానే ఉంది కదా.. కరోనా టీకా ఆసుపత్రి చేరికలు, మరణాలను నిరోధిస్తుందనడానికి ఆధారాల్లేవు’’అని కొందరి అభిప్రాయంగా ఉంది.