Ganja: లారీ ట్రాలీ కింద గంజాయి బస్తాలు!..."పుష్ప"ను మించిపోయిన స్మగ్లర్లు!
- లాంగ్ ట్రాలీ లారీలో గంజాయి తరలింపు
- ట్రాలీ కింద, యాక్సిల్‌కు మధ్యలో ఉన్న కమ్మీలపై గంజాయి బస్తాలు
- పట్టేసిన పోలీసులు
- వీడియోను పోస్ట్ చేసిన టీడీపీ
ఇటీవల విడుదలైన బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన పుష్ప సినిమాలో ఎర్రచందనం దుంగలను పోలీసుల కళ్లుగప్పి అక్రమంగా తరలించేందుకు పలు ఉపాయాలను చూపిన సంగతి తెలిసిందే. అయితే గంజాయి స్మగ్లర్లు పుష్ప సినిమాలో చూపిన టెక్నిక్‌లను మించి మరీ బరి తెగిస్తున్న వైనాన్ని పోలీసులు బయటపెట్టారు. లారీ ట్రాలీ కింద బస్తాల్లో నింపిన గంజాయిని తరలిస్తూ స్మగ్లర్లు పోలీసుకు అడ్డంగా దొరికిపోయారు. ఇలా గంజాయి స్మగ్లర్లను పోలీసులు పట్టుకున్న వీడియోను టీడీపీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఈ ఘటనలో గంజాయి స్మగ్లర్లు లాంగ్ ట్రాలీ కలిగిన లారీని వినియోగించారు. లారీ ఓపెన్ టాప్ ట్రాలీలో ఓ ఇనుప వైర్ల లోడ్ పెట్టి స్మగ్లర్లు బయలుదేరగా..అనుమానం వచ్చిన పోలీసులు ఆ లారీని ఆపి తనిఖీ చేశారు. అనుమానం వచ్చి ట్రాలీతో పాటు దాని కింది భాగాన్ని కూడా పరిశీలించారు. ఈ క్రమంలో ట్రాలీకి, యాక్సిల్‌కు మధ్యలో ఉన్న ఇనుప కమ్మీల మీద గంజాయి బస్తాలను పోలీసులు గుర్తించారు. లారీ ట్రాలీని పైకి లేపి చూడటంతో అక్కడ గంజాయి బస్తాలు పెద్ద సంఖ్యలో కనిపించాయి. దీంతో గంజాయిని సీజ్ చేసిన పోలీసులు లారీని స్వాధీనం చేసుకున్నారు. లారీలో ఉన్న వారిని అరెస్ట్ చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన టీడీపీ... ఈ లారీతో పాటు అందులో ఉన్న వ్యక్తులు నర్సీపట్నం ఎమ్మెల్యే, వైసీపీ నేత ఉమాశంకర్ గణేశ్ అనుచరులుగా ఆరోపించింది. పోలీసుల కంటబడకుండా కొత్త పుంతలు తొక్కుతూ గంజాయి రవాణా చేస్తున్న వైసీపీ ప్రజా ప్రతినిధులు అంటూ ఆ వీడియోకు టీడీపీ ఓ కామెంట్‌ను జత చేసింది.