- పైలట్ స్టిఫాన్ తారబల్కా మృతి చెందినట్టు ప్రకటించిన టైమ్స్ ఆఫ్ లండన్
- యుద్ధం ప్రారంభమైన తొలిరోజే 10 రష్యన్ జెట్స్ ను కూల్చిన స్టెఫాన్
- అత్యున్నత యుద్ధ పురస్కారంతో గౌరవించిన ఉక్రెయిన్ ప్రభుత్వం
రష్యా సేనలకు చుక్కలు చూపించిన ఉక్రెయిన్ ఫైటర్ పైలట్ మేజర్ స్టిఫాన్ తారబల్కా మృతి చెందారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత దాదాపు 40 రష్యా యుద్ధ విమానాలను ఆయన నేలకూల్చారు. శత్రువులకు చిక్కకుండా తన ఫైటర్ జెట్ ను నడిపిస్తూ, శత్రువుల యుద్ధ విమానాలను కూలుస్తూ, పుతిన్ సేనలకు ఆయన ముచ్చెమటలు పట్టించారు. 'ఘోస్ట్ ఆఫ్ కీవ్'గా పేరుగాంచారు. గత నెలలో ఆయన చనిపోయారని 'టైమ్స్ ఆఫ్ లండన్' ప్రకటించింది. 29 ఏళ్ల స్టెఫాన్ ను యుద్ధ వీరుడిగా కీర్తించింది. ఆయన ఒక బిడ్డకు తండ్రి అని తెలిపింది.
మిగ్-29లో దూసుకెళ్తూ శత్రువులపై విరుచుకుపడుతున్న స్టెఫాన్ విమానాన్ని మార్చి 13న రష్యా బలగాలు కూల్చేశాయని టైమ్స్ వెల్లడించింది. ఈ ఘటనలో ఆయన మృతి చెందారని తెలిపింది. దేశం కోసం ఆయన చేసిన సేవలకు గాను ఉక్రెయిన్ ప్రభుత్వం ఆయనకు 'హీరో ఆఫ్ ఉక్రెయిన్' అనే బిరుదు ఇచ్చిందని పేర్కొంది. యుద్ధానికి సంబంధించిన అత్యున్నత పురస్కారమైన 'ఆర్డర్ ఆఫ్ ది గోల్డెన్ స్టార్'తో గౌరవించిందని... ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారని తెలిపింది.
టైమ్స్ ఆఫ్ లండన్ కథనం ప్రకారం స్టెఫాన్ కు చెందిన హెల్మెట్, గాగుల్స్ ను లండన్ లో వేలం వేయబోతున్నారు. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలైన తొలిరోజే... రష్యాకు చెందిన 10 యుద్ధ విమానాలను స్టెఫాన్ కూల్చేశారు. తద్వారా ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపును పొందారు. దీంతో ఆయనను ఉక్రెయిన్ ప్రజలు ప్రేమతో 'ఘోస్ట్ ఆఫ్ కీవ్'గా పిలుచుకోవడం ప్రారంభించారు.
మరోవైపు స్టెఫాన్ చనిపోయినట్టు ఆయన తల్లిదండ్రులకు తెలియలేదని టైమ్స్ తెలిపింది. 'మా కుమారుడి చివరి ఫ్లయిట్ లేదా మరణం గురించి ఉక్రెయిన్ మిలటరీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆయన ఒక మిషన్ మీద ఉన్నారని, ఆ మిషన్ పూర్తయిందని మాత్రం తెలుసు. కానీ మా కుమారుడు తిరిగిరాలేదు. మాకున్న సమాచారం ఇదే' అని స్టెఫాన్ తల్లిదండ్రులు చెప్పినట్టు టైమ్స్ వెల్లడించింది. మరోవైపు స్టెఫాన్ మరణించారనే వార్తతో ఉక్రెయిన్ ప్రజలతో పాటు ఆయనను హీరోగా అభిమానించిన వారందరూ తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.