YV Subba Reddy: వైవీ సుబ్బారెడ్డిపై మంత్రి వేణు మోకరిల్లడంపై శెట్టిబలిజ సంఘం ఆగ్రహం

Settibalija leaders fires on minister Venu Gopala Krishna
  • మాజీ ఎమ్మెల్యే చిట్టబ్బాయి సంస్మరణ సభలో వైవీ కాళ్ల వద్ద మోకరిల్లిన మంత్రి
  • కులం పేరు చెప్పి కాళ్ల మీద పడడం సిగ్గుచేటన్న శెట్టిబలిజ నాయకులు
  • పబ్బం గడుపుకోవడానికి కులం పేరు వాడుకోవద్దని సూచన
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కాళ్ల వద్ద మంత్రి వేణుగోపాలకృష్ణ మోకరిల్లడాన్ని శెట్టిబలిజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. మంత్రి పదవి ఇచ్చినందుకు మోకరిల్లితే తప్పు లేదని, కానీ శెట్టిబలిజ కులం పేరు చెప్పుకుని సుబ్బారెడ్డి కాళ్లమీద పడడం సిగ్గుచేటని ఆ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలాపురంలోని శెట్టిబలిజ గ్రంథాలయంలో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల శెట్టిబలిజ సంఘం కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో నిన్న నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. వైవీ కాళ్ల వద్ద మంత్రి వేణు మోకరిల్లడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. 

రాగద్వేషాలకు అతీతంగా, భయం, పక్షపాతం లేకుండా రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాల్సిన మంత్రి వేణుగోపాలకృష్ణ తన పబ్బం గడుపుకోవడానికి శెట్టిబలిజ కులాన్ని వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. కాగా, శుక్రవారం అమలాపురంలో నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి సంస్మరణ సభలో మంత్రి వేణు వైవీ కాళ్ల వద్ద మోకరిల్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిట్టబ్బాయి కుటుంబానికి ఎవరూ ఊహించని విధంగా ఆర్థిక సాయం అందించారని, అందుకు కారకులైన సుబ్బారెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌లకు ఎన్ని జన్మలైనా శెట్టి బలిజలుగా శిరస్సు వంచి నమస్కరిస్తానని చెప్పిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. 

YV Subba Reddy
Chelluboina Venu Gopala Krishna
Andhra Pradesh
YSRCP
YS Jagan

More Telugu News