- అందరి కోసం ఒక్కరు
- ఒక్కరి కోసం అందరూ..
- మేం అనుసరించేది ఇదే
- మా విజయ రహస్యం ఇదే కావచ్చు
- గుజరాత్ కెప్టెన్ మనోగతం
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో కొత్త జట్టు అయిన గుజరాత్ టైటాన్స్ అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. ఆడిన 9 మ్యాచుల్లో ఎనిమిదింటిలో విజయం సాధించింది ఈ జట్టు. హార్ధిక్ పాండ్యాను కొత్త ఫ్రాంచైజీ యాజమాన్యం ఎంపిక చేసుకునే వరకూ అతడిలో కెప్టెన్ దాగి ఉన్నాడని ఎవరూ అనుకోలేదు. బ్యాట్ తో, బాల్ తో రాణిస్తూ ముంబై ఇండియన్స్ జట్టులో కీలక సభ్యుడిగా పనిచేసిన పాండ్యాను కెప్టెన్ గా ఎంపిక చేసుకున్నందుకు అతడు తన వంతు న్యాయం చేస్తున్నాడు.
‘‘నేను ఒక్కడినే వ్యక్తిగతంగా ఎదిగిపోవడాన్ని నేను నమ్మను. నా జట్టు సభ్యులు అందరితో కలిసే వృద్ధి చెందాలని కోరుకుంటాను. మా విజయానికి కారణం ఇదే అయి ఉండొచ్చు. నేను కెప్టెన్ కావచ్చు. కానీ, అదేమీ అధికార క్రమం కాదు.
ప్రతి ఒక్కరూ ఒకటే బాటలో నడుస్తున్నారు. అందరి కోసం ఒక్కరు.. ఒక్కరి కోసం అందరూ. ఇదే విధానాన్ని మేము పాటిస్తున్నాం. అందుకేనేమో సభ్యులు అందరూ కెప్టెన్ మాదిరి తాము కూడా కీలకమైన వారమని భావిస్తున్నారు. కచ్చితంగా కొత్త అవకాశాన్ని (కెప్టెన్ గా) ఆనందిస్తున్నాను. అద్భుతమైన వ్యక్తులు చుట్టూ ఉన్నారు. ఆశించిన విధంగా ఫలితాలు వస్తున్నాయి.
రాహుల్ కు ఉన్న ఆత్మవిశ్వాసం నిజంగా అద్భుతం. రాహుల్, మిల్లర్ అవకాశం వచ్చినప్పుడు జట్టు కోసం తమ వంతు పాటు పడుతున్నారు. తెవాతియా, రషీద్, మిల్లర్ వంటి ఆటగాళ్లు ఉండడం ఎంతో విలువను తీసుకొస్తుంది. 8, 9, 10వ వికెట్ లోనూ విజయం సాధించగలమన్న నమ్మకాన్ని ఇస్తోంది’’అంటూ పాండ్యా తన అభిప్రాయాలు వెల్లడించాడు.