Guinness World Record: ఒకే కంపెనీలో 84 ఏళ్లు ఉద్యోగం.. గిన్నిస్ రికార్డ్
- బ్రెజిల్ కు చెందిన వాల్టర్ ఆర్థమాన్ ఘనత
- 14 ఏళ్ల వయసులో షిప్పింగ్ అసిస్టెంట్ గా జాబ్
- ఇండస్ట్రియాస్ రెనాక్స్ అనే సంస్థలో ఉద్యోగం
- అంచలంచెలుగా ఎదిగిన వందేళ్ల వాల్టర్
ఒక కంపెనీలో ఓ ఉద్యోగి మహా అయితే పదేళ్లు.. ఇంకా అనుకుంటే ఓ ఇరవై ఏళ్లు పనిచేయడం సహజం. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతం కోసం సంస్థలు మారుతుంటారు. కానీ, ఓ పెద్దాయన తన ఉద్యోగ కెరీర్ లో ఒక్క కంపెనీ కూడా మారలేదంటే నమ్ముతారా? ఒకే ఒక్క కంపెనీలో 84 ఏళ్లు ఉద్యోగిగా పనిచేశారంటే నమ్మ శక్యమా? కానీ, నమ్మి తీరాలి. ఎందుకంటే.. ఆ ఘనతకు గిన్నిస్ బుక్.. వరల్డ్ రికార్డును అందించింది.
అవును, ఆ పెద్దాయన పేరు వాల్టర్ ఆర్థమాన్. వయసు వందేళ్లు. ఉండేది బ్రెజిల్ లోని బ్రస్క్యూ అనే ఓ చిన్న పట్టణం. వయసులో ఉన్నప్పుడు ఇండస్ట్రియాస్ రెనాక్స్ ఎస్ఏ అనే సంస్థలో ఉద్యోగంలో చేరాడు. 1938లో 14 ఏళ్ల పడుచు ప్రాయంలో ఆ సంస్థలో షిప్పింగ్ అసిస్టెంట్ గా ఉద్యోగం స్టార్ట్ చేసిన వాల్టర్.. అంచెలంచెలుగా ఎదిగారు. షిప్పింగ్ అసిస్టెంట్ నుంచి సేల్స్ పొజిషన్ కు, అక్కడి నుంచి సేల్స్ మేనేజర్ గా పదోన్నతి సాధించారు. తన ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో మార్పులు చూశానని వాల్టర్ చెప్పారు.
కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 19నే వాల్టర్ వందో పడిలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, తాను పనిచేసిన సంస్థ సిబ్బంది స్పెషల్ గా సెలబ్రేట్ చేశారు. తాను దేని గురించీ పెద్దగా టెన్షన్లు తీసుకోనని, తనకు రేపు అంటే మరో రోజు అని చెప్పుకొచ్చారు.