Nand Mulchandani: అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా భారత సంతతి నిపుణుడు

Indian origin Nand Mulchandani appointed as chief technology officer in CIA

  • నంద్ మూల్ చందానీకి కీలక బాధ్యతలు
  • ప్రపంచంలోనే పేరుపొందిన అమెరికా గూఢచర్య సంస్థ
  • మొదటిసారి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ నియామకం
  • ఢిల్లీలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన మూల్ చందానీ
  • ప్రఖ్యాత వర్సిటీల్లో డిగ్రీలు 

ఇటీవల కాలంలో అగ్రరాజ్యం అమెరికాలో కీలక పదవులు చేపడుతున్న భారత సంతతి వ్యక్తుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా, అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) మొట్టమొదటి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా భారత సంతతి నిపుణుడు నంద్ మూల్ చందాని నియమితులయ్యారు. ఈ మేరకు సీఐఏ డైరెక్టర్ విలియం జే బర్న్స్ వెల్లడించారు.

టెక్నాలజీ రంగంలో పాతికేళ్లకు పైగా అనుభవం ఉన్న మూల్ చందానీ ప్రతిష్ఠాత్మక సీఐఏ అత్యాధునిక ఆవిష్కరణలను భవిష్యత్ కార్యాచరణ దిశగా మరింత ముందుకు తీసుకెళతారని భావిస్తున్నట్టు తెలిపారు. మూల్ చందానీకి సిలికాన్ వ్యాలీ నిపుణులతో పాటు అమెరికా రక్షణ శాఖలో పనిచేసిన అనుభవం కూడా ఉందని వివరించారు. ప్రైవేటు రంగ నైపుణ్యాలను, స్టార్టప్ లకు ఉండే కసిని, ప్రభుత్వ శాఖలో పనిచేసిన అనుభవాన్ని రంగరించి సీఐఏకి సేవలు అందిస్తారని ఆశిస్తున్నట్టు బర్న్స్ పేర్కొన్నారు. 

మూల్ చందానీ 1979 నుంచి 1987 వరకు ఢిల్లీలోని బ్లూబెల్స్ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చేసిన ఆయన, ప్రఖ్యాత స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో మేనేజ్ మెంట్ ప్రధాన సబ్టెక్టుగా మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. అంతేకాదు, సుప్రసిద్ధ హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో డిగ్రీ పొందారు.

సీఐఏలో నియమితులు కాకముందే, మూల్ చందానీ అమెరికా రక్షణ శాఖకు చెందిన జాయింట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గానూ, క్రియాశీలక డైరెక్టర్ గానూ వ్యవహరించారు. అంతేకాదు, సిలికాన్ వ్యాలీకి సంబంధించి అనేక స్టార్టప్ లను కూడా ఆయన స్థాపించారు. 

సీఐఏలో తొలి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా నియమితుడు కావడం పట్ల మూల్ చందానీ స్పందిస్తూ... ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని తెలిపారు. అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏకి అద్భుతమైన సాంకేతిక నిపుణులు ఉన్నారని, వారితో కలిసి ఓ బృందంగా పనిచేయడం పట్ల ఆసక్తిగా ఉన్నానని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News