Chennai Super Kings: పూరన్ అర్ధ సెంచరీ వృథా.. మళ్లీ ఓడిన హైదరాబాద్
- ఈ సీజన్‌లోనే అత్యుత్తమంగా రాణించిన చెన్నై
- తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 182 పరుగుల భాగస్వామ్యం
- చివరి వరకు పోరాడిన హైదరాబాద్
- ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్న గైక్వాడ్
- చెన్నై ఖాతాలో మూడో విజయం
ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పోరాడి ఓడింది. 203 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 189 పరుగులు మాత్రమే చేసి 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (39)-కెప్టెన్ కేన్ విలియమ్సన్ (47) తొలి వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అభిషేక్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మార్కరమ్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. 17 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు.
నికోలస్ పూరన్ మాత్రం హైదరాబాద్ గెలుపుపై ఆశలు రేపాడు. అయితే, సహచరుల నుంచి మద్దతు కరవవడంతో ఓటమి తప్పలేదు. పూరన్ 33 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 64 పరుగులు చేసి జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు. అయితే, శశాంక్ సింగ్ (15), వాషింగ్టన్ సుందర్(2) అతడికి అండగా నిలవడంలో విఫలమయ్యారు. ఫలితంగా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 189 పరుగులు మాత్రమే చేసి విజయం ముంగిట బోల్తా పడింది. చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరి 4 ఓవర్లు వేసి 46 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లోనే అత్యుత్తమంగా రాణించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్-కాన్వే జోడీ పెవికాల్ రాసుకొచ్చినట్టు క్రీజులో అతుక్కుపోయింది. హైదరాబాద్ బౌలర్లను వీరిద్దరూ ఊచకోత కోశారు. వీరి భాగస్వామ్యాన్ని విడదీసేందుకు హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్ బౌలర్లను మార్చిమార్చి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరికి నిప్పులు చెరిగే బంతులు సంధించే ఉమ్రాన్ మాలిక్ కూడా ఈ జంటను విడదీయలేకపోయాడు. ఇద్దరూ కలిసి ఎడాపెడా బంతులను బౌండరీలకు తరలిస్తూ ఐపీఎల్‌లోనే అత్యధిక తొలి వికెట్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
57 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 99 పరుగులు చేసిన గైక్వాడ్ ఒక్క పరుగు తేడాతో ఐపీఎల్‌లో రెండో సెంచరీ నమోదు చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అతడి అవుట్‌తో 182 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు, కాన్వే 55 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 85 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గైక్వాడ్ అవుటైన తర్వాత బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన ధోనీ 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి చెన్నై రెండు వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు సాధించింది.
చెన్నైకి ఇది మూడో విజయం కాగా, హైదరాబాద్‌కు నాలుగో పరాజయం. మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో ఎలాంటి మార్పులు జరగలేదు. ఓడినప్పటికీ హైదరాబాద్ నాలుగో స్థానంలోనే ఉండగా, గెలిచిన చెన్నై కింది నుంచి రెండో స్థానంలో ఉంది. ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్సైన రుతురాజ్ గైక్వాడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్‌లో నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.