Bandla Ganesh: రోజాకు సన్మానం చేయాలి: బండ్ల గణేశ్
- రోజాను మంత్రిగా చూడటం చాలా ఆనందంగా ఉందన్న గణేశ్
- ఆమెకు మంత్రి పదవి ఇచ్చిన జగన్ కు ధన్యవాదాలు తెలిపిన వైనం
- తెలంగాణలో కేసీఆర్ పాలన బాగుందంటూ కితాబు
ఏపీ మంత్రి రోజాకు, సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కు మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఒకనొక సమయంలో వీరిద్దరూ ఒకరిపై మరొకరు తీవ్ర పదజాలంతో విమర్శించుకున్న సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా గురించి బండ్ల గణేశ్ చాలా అభిమానంగా మాట్లాడారు.
మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన ఆమెకు సినీ పరిశ్రమ తరపున సన్మానం చేయాలని అన్నారు. ఎమ్మెల్యేగా రెండు సార్లు ఓడిపోయి, రెండు సార్లు గెలిచిన రోజాకు మంత్రి పదవి రావడం సంతోషకర విషయమని చెప్పారు. రోజాను మంత్రిగా చూడటం ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. ఆమెకు మంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఒక వ్యక్తిపై కోపం ఉంటే ఆయననే విమర్శించాలని... అంతేకానీ కులం పేరుతో అందరినీ దూషించడం మంచిది కాదని బండ్ల గణేశ్ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా కులం పేరుతో దూషించడం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ ఒక సామాజికవర్గానికే ప్రాధాన్యతను ఇస్తుందనే మాట సరికాదని... చినరాజప్ప, యనమల, అచ్చెన్నాయుడులది ఏ సామాజికవర్గమని అడిగారు.
హైదరాబాదులో కరెంట్ లేదని ఏపీ మంత్రి బొత్స వ్యాఖ్యానించడంపై స్పందిస్తూ... కొందరి గురించి తనను అడగొద్దని అన్నారు. బొత్స తనకు అన్నయ్యలాంటి వారని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ పాలన బాగుందని.. ఇండియాలోనే తెలంగాణ నెంబర్ వన్ స్టేట్ అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటు వేయొద్దని చెప్పడానికి తన వద్ద ఎలాంటి ఆరోపణ లేదని అన్నారు.