Vishwaksen: వివాదంలో విష్వక్సేన్... ఏం జరిగిందంటే...!
- విష్వక్సేన్ హీరోగా అశోకవనంలో అర్జునకల్యాణం
- ఈ నెల 6న రిలీజ్ .. ప్రమోషన్ ఈవెంట్లు నిర్వహిస్తున్న చిత్రబృందం
- హైదరాబాద్ రోడ్లపై ప్రాంక్ వీడియో
- ఓ చానల్ లో దీనిపై డిబేట్
- రసాభాసగా ముగిసిన డిబేట్
టాలీవుడ్ యంగ్ హీరో విష్వక్సేన్ నటించిన 'అశోకవనంలో అర్జునకల్యాణం' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 6న రిలీజ్ కానుండగా, చిత్రబృందం ప్రమోషన్ ఈవెంట్లతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో, ఓ యువకుడితో కలిసి హీరో విష్వక్సేన్ స్వయంగా ప్రాంక్ వీడియో చేశారు. నడిరోడ్డుపై ప్రాంక్ చేయడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో, ఓ తెలుగు వార్తా చానల్ దీనిపై డిబేట్ నిర్వహించి హీరో విష్వక్సేన్ ను కూడా ఆహ్వానించింది.
ఈ సందర్భంగా ఆ టీవీ చానల్ యాంకర్... విష్వక్సేన్ ను ఉద్దేశించి మానసిక రోగి, పాగల్ సేన్ అంటూ పలు పదాలు ఉపయోగించింది. దాంతో మండిపడిన విష్వక్సేన్ 'మీరెవరు నన్ను డిప్రెస్డ్, పాగల్ అని పిలవడానికి?' అంటూ పలు ఘాటు వ్యాఖ్యలు సంధించారు. దాంతో ఒళ్లు మండిన టీవీ యాంకర్... గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో అంటూ ఆవేశం ప్రదర్శించింది. దాంతో విష్వక్సేన్ 'నేను వెళ్లిపోతే నా గురించి ఇష్టంవచ్చినట్టు మాట్లాడుకుంటారని తెలుసు..' అంటూ మైక్ లు పీకేసి వెళ్లిపోయారు.
దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. అయితే ఇది కూడా ప్రాంక్ లో భాగంగానే చేశారా? అనే సందేహాలు నెటిజన్లలో కలుగుతున్నాయి.
కాగా, నడిరోడ్డుపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ హంగామా సృష్టించిన నేపథ్యంలో, హీరో విష్వక్సేన్ పై మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)లో ఫిర్యాదు దాఖలైంది. సినిమా ప్రచారం కోసం రోడ్డుపై న్యూసెన్స్ చేశారని హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే, దీనిపై హీరో విష్వక్సేన్ స్పందించారు. ప్రాంక్ వీడియోలపై కేసులు పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. సినిమా ప్రమోషన్లో భాగంగానే ప్రాంక్ వీడియో ప్లాన్ చేశారని వివరణ ఇచ్చారు. ముందు కంగారు పడ్డానని, అయితే అది ప్రాంక్ అని తెలియడంతో తాను కూడా ఎంజాయ్ చేశానని వెల్లడించారు. ఆ వ్యక్తి వద్ద ఉన్న డబ్బాలో ఉన్నది పెట్రోల్ కాదని, నీళ్లు మాత్రమేనని విష్వక్సేన్ స్పష్టం చేశారు. పబ్లిక్ కు తాము ఎలాంటి ఇబ్బంది కలిగించలేదని చెప్పాడు.