JC Prabhakar Reddy: కేటీఆర్ భయపడి కాదు.. బాగుండదని మాట మార్చి ఉంటారు: జేసీ ప్రభాకర్ రెడ్డి
- ఏపీ గురించి కేటీఆర్ చెప్పింది కరెక్టేనన్న జేసీ
- రోడ్లు బాగోలేకపోవడం వల్ల జీపుల్లో తిరుగుతున్నామని వ్యాఖ్య
- తెలంగాణలో ఉండే షర్మిల విమర్శిస్తే.. కేటీఆర్ కు మండిపోదా? అని ప్రశ్న
ఏపీ పరిస్థితిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. కేటీఆర్ వ్యాఖ్యలకు వైసీపీ మంత్రులు, నేతలు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఈ అంశంపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ 'తమ్ముడూ.. కేటీఆర్. నీవు చెప్పింది కరెక్టే. నీ మాటలపై నిలబడి ఉండు' అని అన్నారు. టంగ్ స్లిప్ అయినట్టుగా మళ్లీ మాట మార్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించారు.
ఉన్న మాట అంటే ఏమీ కాదని.. ఏపీలో కరెంటు లేదని, రోడ్లు దారుణంగా ఉన్నాయని అన్నారు. ఏపీ పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. రోడ్లు బాగోలేకపోవడంతో ఖరీదైన కార్లలో కాకుండా జీపుల్లో తిరగాల్సి వస్తోందని అన్నారు. కేటీఆర్ భయపడి కాకుండా, బాగుండదనే ఉద్దేశంతో మాట మార్చి ఉంటాడని చెప్పారు. తెలంగాణలో ఉండే షర్మిల టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తుంటే ఆయనకు మండిపోదా? అని ప్రశ్నించారు.