Narendra Modi: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో విజేతలంటూ ఎవరూ ఉండరు: నరేంద్రమోదీ
- యద్ధంలో చివరికి మిగిలేది విషాదం, విధ్వంసమేనన్న మోదీ
- దానిని అందరూ అనుభవించాల్సి వస్తుందని ఆవేదన
- అంతర్జాతీయ న్యాయ నిబంధనలను రష్యా ఉల్లంఘిస్తోందన్న జర్మనీ
- ప్రాణనష్టంపై భారత్, జర్మనీ ఆందోళన చెందుతున్నాయంటూ సంయుక్త ప్రకటన
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో విజేతలంటూ ఎవరూ ఉండరని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఐరోపా పర్యటనలో భాగంగా నిన్న జర్మనీ చేరుకున్న మోదీ.. ఆ దేశ చాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్‌తో సమావేశమయ్యారు. అనంతరం నేతలిద్దరు విలేకరులతో మాట్లాడారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత చివరికి మిగిలేది పెను విషాదం, విధ్వంసమేనని, దానిని అందరూ కలిసి అనుభవించాల్సి వస్తుందని మోదీ అన్నారు. కాబట్టి ఇరు దేశాలు తక్షణమే తమ వైరాన్ని పక్కనపెట్టి యుద్ధానికి ముగింపు పలకాలని కోరారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని, ఇదే విషయాన్ని భారత్ తొలి నుంచీ చెబుతోందన్నారు. అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలపై యుద్ధ ప్రభావం విపరీతంగా పడే అవకాశం ఉందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.
జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ మాట్లాడుతూ.. రష్యాపై పలు ఆరోపణలు చేశారు. అంతర్జాతీయ న్యాయ నిబంధనల ఉల్లంఘనకు రష్యా పాల్పడుతోందన్నారు. అనంతరం వెలువడిన సంయుక్త ప్రకటనలో షోల్డ్ మాట్లాడుతూ.. రష్యా దళాల అన్యాయపు దాడిని జర్మనీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. యుద్ధం కారణంగా జరుగుతున్న భారీ ప్రాణనష్టంపై భారత్, జర్మనీలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయన్నారు. ఒక దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశికత సమగ్రతను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.
కాగా, మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా నిన్న బెర్లిన్‌లోని ఫెడరల్ చాన్సెలరీ వద్దకు చేరుకున్న మోదీకి షోల్జ్ స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ ముఖాముఖి చర్చలు జరిపారు. షోల్జ్‌తో మోదీ భేటీ కావడం ఇదే తొలిసారి. మరోవైపు, ఆరో దఫా అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల (ఐజీసీ) సమావేశానికి మంత్రులు నిర్మలా సీతారామన్, జైశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్ హాజరయ్యారు. కాగా, మోదీ నేడు డెన్మార్క్‌లో పర్యటించనున్నారు.