Pakistan: పాక్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. నవాజ్ షరీఫ్ శిక్ష రద్దు?
- నవాజ్‌పై పలు అవినీతి ఆరోపణలు
- రెండు కేసుల్లో శిక్ష అనుభవిస్తూ అనారోగ్యంతో లండన్‌కు షరీఫ్
- అరెస్ట్ భయంతో ఆ తర్వాత తిరిగిరాని వైనం
- షరీఫ్ శిక్షను రద్దు చేసే యోచనలో ప్రభుత్వం
- పదేళ్ల కాలపరిమితితో పాస్ పోర్ట్ జారీ
అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ప్రవాస జీవితం గడుపుతున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు మంచి రోజులు వచ్చినట్టే కనిపిస్తున్నాయి. ఇమ్రాన్ ప్రభుత్వం కూలిపోయి షరీఫ్ సోదరుడు షెబాజ్ గద్దెనెక్కడంతో లండన్‌లో ఉన్న షరీఫ్ తిరిగి పాక్‌లో కాలుమోపి రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నారు.
ఇందులో భాగంగా పాకిస్థాన్‌లోని నయా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నవాజ్ షరీఫ్‌పై గత ప్రభుత్వ హయాంలో అవినీతి కేసుల్లో కోర్టులు విధించిన శిక్షను రద్దు చేయాలని, లేదంటే సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. శిక్షను తప్పుగా విధించడాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించే అవకాశాన్ని నవాజ్‌కు కల్పించాలని యోచిస్తోంది. శిక్షను రద్దు చేయడం, లేదంటే సస్పెండ్ చేసే అధికారం సమాఖ్య, పంజాబ్ సర్కారుకు ఉన్నట్టు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రానా సనావుల్లా పేర్కొన్నారు.
పాకిస్థాన్‌కు మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ (72)పై ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పలు అవినీతి కేసులు నమోదు చేయగా, రెండు కేసుల్లో ఆయనకు 2018లో కోర్టులు శిక్షలు విధించాయి. లండన్‌లో అక్రమాస్తులు కూడబెట్టిన కేసులో పదేళ్లు, సౌదీ అరేబియాలో ఉక్కు పరిశ్రమకు సంబంధించిన కేసులో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. శిక్ష అనుభవిస్తున్న సమయంలో షరీఫ్ అనారోగ్యానికి గురికావడంతో నెల రోజుల అనుమతితో చికిత్స కోసం నవంబరు 2019లో లండన్ వెళ్లారు.
ఆ తర్వాత కోర్టు పలుమార్లు ఆదేశించినా తిరిగి పాక్ కు రాలేదు. దీంతో ఆయనపై కేసుల విచారణను లాహోర్ హైకోర్టు నిలిపివేసింది. ఆయన కనుక పాక్‌లో అడుగుపెడితే అరెస్ట్ తథ్యం కావడంతో లండన్‌లోనే గడుపుతున్నారు. ఇప్పుడు ఇమ్రాన్ ప్రభుత్వం గద్దె దిగడంతో షరీఫ్ సోదరుడు షెబాజ్ ప్రధాని అయ్యారు. దీంతో ఆయన తిరిగి పాక్ రావాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన పదేళ్ల కాలపరిమితితో కూడిన కొత్త పాస్‌పోర్టును పాక్ ప్రభుత్వం జారీ చేసింది.