Kapil Dev: వినోద్ కాంబ్లీలా కావొద్దు.. యువ ఆటగాళ్లకు కపిల్ దేవ్ సలహా
- సచిన్, కాంబ్లీ కెరీర్ ను పోలుస్తూ కపిల్ సూచనలు
- ఆటపైనే ఫోకస్ ఉండాలని సలహా
- పక్కదారి పడితే కెరీర్ పోతుందని హెచ్చరిక
- తపన, హార్డ్ వర్క్ లే మంచి స్థాయికి తీసుకెళ్తాయని సూచన
సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ.. ఈ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో. యుక్త వయసులో ఇద్దరూ కలిసి నెలకొల్పిన భాగస్వామ్యం ప్రపంచ రికార్డ్ అన్న విషయం తెలిసిందే. ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్ ను కలిసి ఆడినా.. సచిన్ లా కాంబ్లీ మాత్రం ఎదగలేకపోయాడు. ఇప్పుడు తాజాగా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ ఓ దుమారాన్ని రేపారు.
సచిన్ టెండూల్కర్ లా గొప్ప ఆటగాడిగా ఎదగాలని, వినోద్ కాంబ్లీలా చెడగొట్టుకోవద్దని యువ ఆటగాళ్లకు ఆయన సలహాలిచ్చారు. సక్సెస్ ను చూసి మురిసిపోవద్దని యువ ఆటగాళ్లను హెచ్చరించారు. అండర్ 19 ఆటగాళ్లు రాజ్ అంగద్ బవా, హర్నూర్ సింగ్ కు సన్మాన కార్యక్రమం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
16 ఏళ్ల చిన్న వయసులోనే సచిన్ తన కెరీర్ ను ప్రారంభించి.. 34 వేలకుపైగా పరుగులు సాధించాడని గుర్తు చేశారు. అన్ని ఫార్మాట్ లలో 100 శతకాలు చేశాడని చెప్పారు. సచిన్ కెరీర్ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆ ప్రతిభ, హార్డ్ వర్క్ సచిన్ ను ఆ స్థాయికి తీసుకెళ్లాయన్నారు.
కాంబ్లీది సచిన్ కు తీసిపోని ప్రతిభేనని, అతడూ దేవుడిచ్చిన గొప్ప ఆటగాడేనని, కానీ, ఆటమీద దృష్టి సారించాల్సిన సమయంలో పక్కదారి పట్టి కెరీర్ ను పోగొట్టుకున్నాడని చెప్పారు. అదే ఓ ఆటగాడు తన ఫోకస్ ను కోల్పోయాడంటే ఆట కూడా పాడైపోతుందని చెప్పారు. ఎప్పుడైనా ప్రదర్శననే లెక్కలోకి వస్తుందని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఓ ఆటగాడు గొప్ప ఆటగాడా? లేదా సమాజం మరచిన స్టారా? అనేది నిర్ధారించేది ప్రదర్శనేనని చెప్పారు.
కాంబ్లీ, సచిన్ ఒకేసారి కెరీర్ ను ప్రారంభించారని, కానీ, అర్థాంతరంగా వచ్చిన సక్సెస్ తో అతి తక్కువ కాలంలోనే కాంబ్లీ తన కెరీర్ ను నాశనం చేసుకున్నాడని చెప్పారు. యువ క్రికెటర్లు సక్సెస్ ను నెత్తికెక్కించుకుంటే కాంబ్లీలాగానే కెరీర్ పాడవుతుందన్నారు. ఏదైనా సాధించాలనే తపన, కష్టపడి పనిచేసే తత్వం కన్నా గొప్పవేమీ లేవన్నారు.
తాను తక్కువ మాట్లాడతానని, ఏదైనా చేతల్లో చూపించాలని కపిల్ దేవ్ యువ ఆటగాళ్లకు సూచించారు. కాగా, 17 టెస్టులాడిన వినోద్ కాంబ్లీ 1084 పరుగులు చేశాడు. 104 వన్డేల్లో 2,477 పరుగులు సాధించాడు.