Cannes: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో భారత్ కు అరుదైన గౌరవం... అధికారిక దేశం హోదా
- ఈ నెల 17 నుంచి కేన్స్ చలనచిత్రోత్సవం
- 75 వసంతాల కేన్స్
- అటు స్వతంత్ర భారతావనికి కూడా 75 ఏళ్లు
- కీలక నిర్ణయం తీసుకున్న కేన్స్ నిర్వాహకులు
అంతర్జాతీయ చలనచిత్ర రంగంలో ఆస్కార్ అవార్డులకు ఎంత విలువ ఉంటుందో, కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమయ్యే చిత్రాలకు కూడా అదే స్థాయిలో గుర్తింపు ఉంటుంది. ఫ్రాన్స్ లోని కేన్స్ లో ఈ ఏడాది చలన చిత్రోత్సవాలు ఈ నెల 17 నుంచి 28వ తేదీ వరకు జరగనున్నాయి.
ఈసారి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 75 వసంతాల స్వతంత్ర భారత్ కు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ మార్కెట్లో అరుదైన ఘనత అందించారు. భారత్ కు కేన్స్ చిత్రోత్సవ విపణిలో గౌరవనీయ అధికారిక దేశం హోదా కల్పించారు. అటు, కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కూడా 75 వసంతాల వేడుక జరుపుకుంటుండడం విశేషం.
ఈసారి కేన్స్ లో భారతీయ దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే తెరకెక్కించిన 'ప్రతిధ్వని' చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 4కే టెక్నాలజీకి అనుగుణంగా పునరుద్ధరిస్తున్నారు. 'ప్రతిధ్వని' చిత్రంతో పాటు హాలీవుడ్ క్లాసిక్ గా పేరుగాంచిన 'సింగిన్ ద రెయిన్' చిత్రాన్ని కూడా కేన్స్ లో ప్రదర్శించనున్నారు. మరో భారతీయ చిత్రం 'థాంప్' (అరవిందన్ గోవిందన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం) కూడా ఇక్కడ ప్రదర్శనకు నోచుకోనుంది.
కాగా, బాలీవుడ్ భామ దీపిక పదుకొణేకు అరుదైన గౌరవం లభించింది. కేన్స్ ఫిలిం పెస్టివల్ కాంపిటీషన్ జ్యూరీలో సభ్యురాలిగా నియమితులయ్యారు.