Andhra Pradesh: ఒకేసారి 52 మంది ఏఎస్పీల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
- కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో తాజా బదిలీలు
- పలు జిల్లాలకు అదనపు ఎస్పీల నియామకం
- ఇతరత్రా విభాగాల్లోనే అదే ర్యాంకు పోస్టుల భర్తీ
ఏపీలో భారీ సంఖ్యలో పోలీసు అధికారులు బదిలీ అయ్యారు. ఒకేసారి 52 మంది అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ మంగళవారం సాయంత్రం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుతో మొత్తం జిల్లాల సంఖ్య 26కు చేరిన సంగతి తెలిసిందే. ప్రతి జిల్లాకు ఇద్దరేసి అదనపు ఎస్పీలను కేటాయించక తప్పని పరిస్థితుల్లోనే ఈ బదిలీలు జరిగినట్లుగా సమాచారం.
అన్ని జిల్లాలకు అదనపు ఎస్పీల పోస్టింగ్‌ల నేపథ్యంలో ఇతరత్రా విభాగాల్లో ఖాళీగా ఉన్న అదనపు ఎస్పీ ర్యాంక్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఈ మేరకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ బదిలీల్లో ఆయా జిల్లాల్లో ఇంకా ఖాళీగా ఉన్న అదనపు ఎస్పీలు, వివిధ విభాగాల్లో అదే కేడర్‌లో ఖాళీ అయిన పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది.
ఈ బదిలీల్లో విజయవాడ అడిషనల్ డీసీపీగా సి.జయరామరాజు, అనంతపురం అడిషనల్ ఎస్పీగా ఇ.నాగేంద్రుడు, తూర్పుగోదావరి అడిషనల్ క్రైమ్ ఎస్పీగా జి.వెంకటేశ్వరరావు, ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీగా బి.నాగభూషణ్‌రావు, మెరైన్ అడిషనల్ ఎస్పీగా జీబీఆర్ మధుసూదన్‌రావు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ ఎస్పీగా జి.స్వరూపరాణి, అడ్మిన్ అడిషనల్ ఎస్పీగా వెంకట రామాంజనేయులు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ ఎస్పీగా భవానీ హర్ష, విజయవాడ సిటీ అడిషనల్ క్రైమ్ డీసీపీగా పి.వెంకటరత్నం, విశాఖ ఏసీబీ అడిషనల్ ఎస్పీగా కె.శ్రావణి, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ ఎస్పీగా చిదానందరెడ్డి, ప్రకాశం అడ్మిన్ అడిషనల్ ఎస్పీగా కె.నాగేశ్వరరావు, గుంటూరు అడ్మిన్ అడిషనల్ ఎస్పీగా కె.సుప్రజ, ఎస్‌ఈబీ అడిషనల్ ఎస్పీగా అస్మా ఫర్హీన్ పోస్టింగులు పొందారు.