Rain: హైదరాబాద్‌లో కుమ్మేసిన వర్షం.. పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

Heavy Rain Pours in Hyderabad Early Morning

  • ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం
  • లోతట్టు ప్రాంతాలు జలమయం
  • రోడ్లపైకి నీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం
  • నేడు, రేపు వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణశాఖ

హైదరాబాద్‌లో ఈ తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఫలితంగా నగరం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న నగర వాసులకు ఈ వర్షం ఊరటనిచ్చింది. అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, అల్వాల్, సైదాపేట, చంపాపేట, సరూర్‌నగర్, కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్, వనస్థలిపురం సహా దాదాపు నగరమంతా భారీ వర్షం కురిసింది. 

భారీ వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరుకుంది. పంజాగుట్ట సర్కిల్ వద్ద భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆయా ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భారీగా వర్షం కురుస్తోంది. ఉపరితల ద్రోణి ప్రభావంతోనే వర్షాలు పడుతున్నాయని, నేడు, రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

  • Loading...

More Telugu News