Raj Thackeray: హనుమాన్​ చాలీసా చదివే ప్రయత్నం.. 18 వేల మంది ఎంఎన్​ఎస్​ కార్యకర్తలపై పోలీసుల చర్యలు

Raj Thackeray Fumes Over Loud Speakers Issue On Government

  • మహారాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు
  • లౌడ్ స్పీకర్లలో అజాన్ చదివితే.. హనుమాన్ చాలీసా చదువుతామన్న రాజ్ థాకరే
  • నిబంధనలు పాటించేవారిపైనే కేసులంటూ మండిపాటు
  • నవనీత్ రాణా, రవి రాణాలకు బెయిల్
  • జేజే ఆసుపత్రికి నవనీత్ రాణా
  • శాంతిభద్రతలపై శరద్ పవార్ నేతృత్వంలో సమీక్ష

మసీదులపై లౌడ్ స్పీకర్లు సామాజిక సమస్య అని, అది మతపరమైన సమస్య కానేకాదని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాకరే అన్నారు. రాజ్ థాకరేపై ఉన్న పాత కేసులను తోడడంతో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని, తనకు ఇప్పటిదాకా చాలా మంది కార్యకర్తలు ఫోన్ చేశారని చెప్పారు. తమకే ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. నిబంధనలను కచ్చితంగా పాటించేవారిపైనే కేసులు పెడుతున్నారని విమర్శించారు.   

చాలా ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లలో అజాన్ ను వినిపించట్లేదని చెప్పారు. తమ ఆంతర్యాన్ని అర్థం చేసుకుని తమకు మద్దతిస్తున్న వాళ్లందరికీ ధన్యవాదాలు అని చెప్పారు. ఒకవేళ లౌడ్ స్పీకర్లలో అజాన్ చదివినట్టు తమకు తెలిస్తే.. తాము కూడా హనుమాన్ చాలీసాను చదువుతామని తేల్చి చెప్పారు. 

కాగా, లౌడ్ స్పీకర్ల అంశానికి సంబంధించి శరద్ పవార్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ఇవాళ సమావేశమైంది. శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించింది. రాష్ట్రంలో 1,140 మసీదులుండగా.. 135 మసీదుల్లో లౌడ్ స్పీకర్ తో అజాన్ చదివారని హోం శాఖ తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

 మరోవైపు హనుమాన్ చాలీసా చదివేందుకు లౌడ్ స్పీకర్లను సిద్ధం చేస్తున్న 18 వేల మంది ఎంఎన్ఎస్ కార్యకర్తలకు 149 సెక్షన్ కింద నోటీసులను పోలీసులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంఎన్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఇంటి ముందు హనుమాన్ చాలీసా చదివేందుకు ప్రయత్నించిన కేసులో ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాలకు బెయిల్ మంజూరైంది. నవనీత్ రాణాను బైకుల్లా జైలు నుంచి ముంబైలోని జేజే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇంకా బెయిల్ పై విడుదల చేయలేదు. మత కలహాలు చెలరేగేందుకు రెచ్చగొట్టారన్న అభియోగాల మీద వారిపై కేసును నమోదు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News