BCCI: సాహాను బెదిరించిన జర్నలిస్టుపై రెండేళ్ల నిషేధం
- ఇంటర్వ్యూ ఇచ్చేందుకు నిరాకరించిన సాహా
- బెదింపులకు దిగిన జర్నలిస్టు బోరియా మజుందార్
- ఈ వ్యవహారంపై ముగ్గురు సభ్యుల కమిటీని నియమించిన బీసీసీఐ
- కమిటీ నివేదిక ఆధారంగా మజుందార్‌పై చర్యలు
భారత క్రికెటర్ వృద్ధిమాన్ సాహాకు ఎదురైన బెదిరింపుల వ్యవహారంలో బీసీసీఐ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. సాహాను బెదిరింపులకు గురి చేసిన జర్నలిస్టు బోరియా మజుందార్‌ను రెండేళ్ల పాటు నిషేధిస్తూ బీసీసీఐ ఉత్తర్వులు జారీ చేసింది. తనకు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు నిరాకరించిన సాహాపై మజుందార్ బెదిరింపులకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ విషయం వెలుగులోకి రావడంతో దీనిపై సమగ్ర విచారణ నిర్వహించేందుకు ముగ్గురు సభ్యులతో బీసీసీఐ ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మజుందార్‌ను రెండేళ్ల పాటు నిషేధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
బీసీసీఐ జారీ చేసిన ఆదేశాల ప్రకారం... దేశంలో జరిగే ఏ క్రికెట్ మ్యాచ్‌కు కూడా మజుందార్ హాజరు కాలేరు. ఈ మేరకు అన్నిరాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు ఇప్పటికే బీసీసీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో విదేశాల్లో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లకు కూడా మజుందార్‌ను అనుమతించరాదని కోరుతూ ఐసీసీకి కూడా బీసీసీఐ ఓ లేఖ రాయనుంది. అదే సమయంలో రెండేళ్ల పాటు మజుందార్‌కు అక్రిడిటేషన్‌ను కూడా జారీ చేయకుండా బీసీసీఐ చర్యలు తీసుకోనుంది.