YSRCP: వైసీసీ నేత గంజి ప్ర‌సాద్ హ‌త్య కేసులో ఆరుగురి అరెస్ట్‌... నిందితుల్లో వైసీపీ నేత బ‌జార‌య్య‌

6 accused arrested in ganji prasad murder case

  • హ‌త్య కేసులో మొత్తం 12 మందిపై కేసు
  • బ‌జార‌య్య  ప్రోద్బ‌లంతోనే ప్ర‌సాద్ హ‌త్య‌
  • హ‌త్య‌కు ముందు ప్ర‌సాద్ రాక‌పోక‌ల‌పై నిందితుల రెక్కీ
  • ముగ్గురు నిందితులు హ‌త్య‌లో పాల్గొన్నార‌న్న ఎస్పీ

ఏలూరు జిల్లా జి. కొత్త‌ప‌ల్లిలో గోపాల‌పురం ఎమ్మెల్యే త‌లారి వెంక‌ట్రావుపై దాడికి కార‌ణంగా నిలిచిన వైసీపీ గ్రామ అధ్య‌క్షుడు గంజి ప్ర‌సాద్ హ‌త్య కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో గంజి ప్ర‌సాద్ వ్య‌తిరేక వ‌ర్గానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న బ‌జార‌య్య కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈ హ‌త్య కేసులో మొత్తం 12 మందిపై కేసులు న‌మోదు చేశామ‌న్న ఏలూరు ఎస్పీ... వారిలో ఆరుగురిని అరెస్ట్ చేసిన‌ట్లు బుధ‌వారం వెల్ల‌డించారు. 

ఈ సంద‌ర్భంగా హ‌త్య‌కు దారి తీసిన కార‌ణాలు, హ‌త్య‌కు ముందు నిందితులు ప‌న్నిన కుట్ర‌ను కూడా ఎస్పీ వెల్ల‌డించారు. గంజి ప్ర‌సాద్ హ‌త్య‌లో ముగ్గురు స్వ‌యంగా పాలుపంచుకోగా...వారిని బ‌జార‌య్య‌నే ప్రోత్స‌హించార‌ని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన వారిలో బ‌జార‌య్య‌తో పాటు సురేశ్, మోహ‌న్ కుమార్‌, హేమంత్‌, గంజి నాగార్జున‌, రెడ్డి స‌త్య‌నారాయ‌ణ‌లు ఉన్నార‌ని ఆయ‌న తెలిపారు. 

గ‌త నెల నిందితుడు సురేశ్ హ‌త్య‌కు వినియోగించిన క‌త్తులను సేక‌రించాడని, హ‌త్య‌కు మూడు రోజుల ముందు నిందితులు రెక్కీ కూడా నిర్వ‌హించార‌ని పేర్కొన్నారు. ప్ర‌సాద్ రాక‌పోక‌ల‌ను గంజి నాగార్జున ప‌రిశీలించ‌గా... సురేశ్, హేమంత్‌లు గంజి ప్ర‌సాద్‌ను బైక్‌పై వెంబ‌డించార‌ని ఎస్పీ తెలిపారు.

  • Loading...

More Telugu News