Sunil Gavaskar: ప్రభుత్వం కేటాయించిన భూమిని తిరిగిచ్చేసిన గవాస్కర్
- 1988లో గవాస్కర్ కు భూమిని కేటాయించిన మహారాష్ట్ర ప్రభుత్వం
- క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయాలనుకున్న గవాస్కర్
- ఇప్పటి వరకు కార్యరూపం దాల్చని వైనం
1988లో మహారాష్ట్ర ప్రభుత్వం తనకు ఇచ్చిన భూమిని టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తిరిగిచ్చేశారు. ముంబైలోని అత్యంత ఖరీదైన బాంద్రా ప్రాంతంలో 20వేల చదరపు అడుగుల్లో ఈ భూమి ఉంది. ఇందులో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయాలనుకున్న గవాస్కర్ ఆ పని చేయలేకపోయారు.
అకాడమీ సంగతేమో కానీ, కనీస మౌలిక సదుపాయాలను కూడా అక్కడ ఏర్పాటు చేయలేదు. క్రికెట్ అకాడమీకి సంబంధించి సచిన్ టెండూల్కర్ తో కలసి ఆమధ్య సీఎం ఉద్ధవ్ థాకరేను గవాస్కర్ కలిశారు. తనకున్న ప్లాన్ ను వివరించారు. చివరకు అది కూడా కార్యరూపం దాల్చలేదు.
ఈ నేపథ్యంలో గవాస్కర్ పై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు అవుతున్నా అకాడమీని నిర్మించకుండా ఖరీదైన భూమిని ఖాళీగా ఉంచితే ఎలాగని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తనకు కేటాయించిన భూమిని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తున్నట్టు ఉద్ధవ్ థాకరేకి గవాస్కర్ లేఖ రాసినట్టు రాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ పేర్కొంది.