Tirumala: తిరుమలలో కిడ్నాపైన బాలుడి కథ సుఖాంతం.. చిన్నారిని అపహరించి మైసూరు తీసుకెళ్లిన మతిస్థిమితం లేని మహిళ

Happy Ending to Tirumala Kidnapped boy story

  • ఈ నెల 3న తిరుమల గొల్లమండపం సమీపంలో బాలుడి అపహరణ
  • నేరుగా మైసూరులోని తన ఇంటికి తీసుకెళ్లిన మహిళ
  • బాలుడిని తీసుకొచ్చి టీటీడీ విజిలెన్స్ అధికారులకు అప్పగించిన మహిళ తల్లిదండ్రులు

తిరుమలలో కిడ్నాపైన బాలుడి కథ సుఖాంతమైంది. ఓ మతిస్థిమితం లేని మహిళ బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్టు తేలింది. తిరుమలలోని గొల్లమండపం సమీపంలో ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని మహిళ ఐదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసింది. 

కుమారుడి కోసం గాలించిన తల్లి సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలుడి తండ్రి ఓ హోటల్‌లో పనిచేస్తుండగా, తల్లి స్వాతి శ్రీవారి ఆలయ సమీపంలో భక్తుల నుదుట గోవింద నామాలు పెడుతూ వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. ఆదివారం సాయంత్రం గొల్లమండపం సమీపంలో బాలుడి వద్దకు వచ్చిన గుర్తు తెలియని మహిళ అతడికి స్వీట్లు తినిపించి ఆపై తనతోపాటు తీసుకెళ్లిపోయింది. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. పింక్ చుడీదార్ ధరించిన మహిళ బాలుడిని తీసుకెళ్లినట్టు సీసీటీవీల్లో రికార్డయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె కోసం వెతుకులాట ప్రారంభించారు. 

మరోవైపు బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ నేరుగా మైసూరులోని తన ఇంటికి తీసుకెళ్లింది. బాలుడిని చూసిన ఆమె తల్లిదండ్రులు ఆ చిన్నారి ఎవరని ప్రశ్నించారు. వివరాలు అడిగి తెలుసుకుని అనంతరం బాలుడిని తీసుకుని తిరుమల చేరుకున్నారు. చిన్నారిని టీటీడీ విజిలెన్స్ అధికారులకు అప్పగించారు. తమ కుమార్తె పేరు పవిత్ర అని, ఆమెకు మతిస్థిమితం లేదని వారు చెప్పారు. తమ చెంతకు చేరిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

  • Loading...

More Telugu News