Ravindra Jadeja: జడేజా ఫామ్ పై ఆందోళన లేదు.. కానీ సరైన బ్యాటింగ్ ఆర్డర్ కావాలి: సీఎస్కేహెడ్ కోచ్
- టీ20 మ్యాచ్ అంటే చాలా కష్టమైనదన్న ఫ్లెమింగ్
- 5 లేదా 6వ స్థానంలో కుదురుకునేందుకు సమయం ఉండదని వ్యాఖ్య
- సరైన బ్యాటింగ్ ఆర్డర్ పై దృష్టి పెట్టాలని సలహా
ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఫామ్ పై తమకు ఆందోళన లేదని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశారు. జట్టును విజయపథంలో నడిపించలేక కెప్టెన్సీకి దూరమైన జడేజా.. బుధవారం ఆర్సీబీతో మ్యాచ్ లోనూ రాణించలేకపోవడం గమనార్హం. ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన జడేజా కుదురుకుని జట్టు విజయానికి తోడ్పడి ఉంటే అందరూ సంతోషించి ఉండేవారు. కానీ ఐదు బంతుల్లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి అవుటైపోయాడు. ఐపీఎల్ 2022 సీజన్ లో 10 మ్యాచుల్లో అతడు చేసిన స్కోరు కేవలం 116 పరుగులు.
ఈ క్రమంలో స్టీఫెన్ ఫ్లెమింగ్ మీడియా ప్రశ్నలకు స్పందించాడు. ‘‘జడేజా ఫామ్ పై నాకు ఆందోళన లేదు. టీ20 గేమ్ అన్నది కష్టంగా ఉంటుంది. ఐదో నంబర్ లేక ఆరో నంబర్ కు బ్యాటింగ్ కు దిగుతుంటే టెంపో (రిథమ్) అందుకునేందుకు పెద్దగా సమయం ఉండదు. కనుక దీనిపై మేము ప్రస్తుతం దృష్టి పెట్టాల్సి ఉంది. రానున్న మ్యాచ్ లకు మంచి బ్యాటింగ్ ఆర్డర్ ను రూపొందించుకోవాల్సి ఉంది’’ అని స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు.