India: ‘జీ సూయిస్ రావి’ అంటూ ప్రధాని మోదీ ఫ్రెంచి భాషలో ట్వీట్
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తో భేటీ
- గుండెలకు హత్తుకుని స్వాగతం పలికిన మెక్రాన్
- రెండు దేశాల భాగస్వామ్యంపై చర్చలు
ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లారు. ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తో ఆయన భేటీ అయ్యారు. నిన్న డెన్మార్క్ పర్యటన ముగియడంతో ఆయన ఫ్రాన్స్ కు బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్యారిస్ లో దిగిన మోదీకి ఘన స్వాగతం లభించింది.
ఎలిసీ ప్యాలేస్ లో మోదీని గుండెలకు హత్తుకుని ఫ్రాన్స్ అధ్యక్షుడు సాదర స్వాగతం పలికారు. దానికి సంబంధించిన ఫొటోలను ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తన స్నేహితుడిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.
ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చించినట్టు మోదీ చెప్పారు. రెండు దేశాల భాగస్వామ్యం అనేక రంగాలకు విస్తరించిందని, ఈ బంధం గర్వకారణమని అన్నారు. చర్చలు ఫలప్రదంగా జరిగాయని, ఇంతటి మంచి ఆతిథ్యం ఇచ్చిన ఫ్రాన్స్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని మోదీ అన్నారు.
అంతేకాదు.. ఫ్రెంచ్ లోనూ ఆయన ట్వీట్ చేశారు. ‘జీ సూయిస్ రావి (చాలా సంతోషంగా ఉంది)’ అంటూ తమ భేటీ గురించి వివరించారు. కాగా, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరింధమ్ బాగ్చీ కూడా ఇరు దేశాధ్యక్షుల సమావేశం గురించి ట్విట్టర్ లో వెల్లడించారు. భారత్–ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై తదుపరి చర్యలకు మోదీ, మెక్రాన్ అంగీకరించారని చెప్పారు.
భేటీ సందర్భంగా ఇరు దేశాధినేతలు ఉక్రెయిన్ సంక్షోభంపై చాలా సేపు చర్చించినట్టు తెలుస్తోంది. దాని వల్ల ఎదురైన సంక్షోభ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారని సమాచారం. గత వారం జరిగిన ఎన్నికల్లో దేశాధ్యక్షుడిగా ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ మరోసారి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చాలా దేశాధినేతలు ఆయన్ను కలిశారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ కూడా మెక్రాన్ రెండో సారి అధ్యక్షుడయ్యాక తొలిసారి భేటీ అయ్యారు.