RBI: ఆర్బీఐ రేట్లు పెంచిన ఫలితం.. గృహ, వాహన, వ్యక్తిగత రుణాల ఈఎంఐలు భారం.. మ్యూచువల్ ఫండ్స్ పైనా ఎఫెక్ట్
- బ్యాంకు రుణాలు రెపో పైనే ఆధారం
- గృహ రుణాలు ఎంసీఎల్ఆర్ కు అనుసంధానం
- ఇప్పటికే పెరిగిపోతున్న ఎంసీఎల్ఆర్
- ఇప్పుడు మరింత పెరిగే అవకాశం
- తగ్గనున్న మ్యూచువల్ ఫండ్ ఆస్తులు
- డిపాజిట్ రేట్లూ పెరిగే అవకాశం
ఎలాంటి సమాచారం లేకుండానే నిన్న కీలక వడ్డీ రేట్లను పెంచేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) షాక్ ఇచ్చింది. సగటు వినియోగదారుడికి ఇది గుదిబండే. కారణం.. దాదాపు 40 బేసిస్ పాయింట్లను పెంచడమే. 2018 ఆగస్టు తర్వాత వడ్డీ రేట్లను ఇంతలా పెంచడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే లోన్లు తీసుకున్న.. ఇకపై తీసుకోబోయే వారి మీద ఇది పెను ప్రభావమే చూపనుంది. ఈఎంఐలు భారీగా పెరగనున్నాయి.
40 శాతం బ్యాంకు రుణాలు రెపోరేటు మీదే ఆధారపడి ఉండడం వల్ల.. గృహ, వాహన, వ్యక్తిగత రుణాల ఈఎంఐలు కొంత భారం కానున్నాయి. పాత రుణాలన్నీ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్స్ (ఎంసీఎల్ఆర్)కే అనుసంధానమై ఉండడం, ఆ రేట్లు ఇప్పటికే పైపైకి పోతుండడంతో గృహ రుణాలు మరింత భారమవుతాయి. 15 ఏళ్ల కాలపరిమితితో రూ.కోటి గృహ రుణం తీసుకుంటే ఒక్కో ఈఎంఐపై రూ.2,176 ఎక్కువ కట్టాల్సి వస్తుంది.
వాటితో పాటు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీల వడ్డీలూ పెరగనున్నాయి. ఆర్బీఐ రెపోరేట్లను పెంచడంతో టర్మ్ డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీని పెంచాల్సి ఉంటుంది. అయితే, పెరిగిన రెపో రేటుకు సమానంగా డిపాజిట్ రేట్లు పెరిగే అవకాశం మాత్రం లేదని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండీ చెప్పారు. వడ్డీ రేట్ల పెంపుతో మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లోని ఆస్తుల విలువ తగ్గనుంది.
మరోవైపు బ్యాంకుల వద్ద క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్ఆర్) పరిమితిని పెంచినా.. బ్యాంకుల ద్రవ్య చెలామణీపై పెద్దగా ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఆర్బీఐ దగ్గర బ్యాంకులకు సంబంధించిన రూ.2 లక్షల కోట్ల నిధులున్నాయని అంటున్నారు.