Raghu Rama Krishna Raju: జగన్ సభలకు జనాలు రావడం లేదు: రఘురామకృష్ణరాజు
- జగనన్న వసతి దీవెన ఒక వంచనన్న రఘురాజు
- తల్లుల అకౌంట్లలోకి డబ్బులు వేసి కాలేజీలకు ఇవ్వడమేమిటని ప్రశ్న
- డబ్బులు నేరుగా కాలేజీలకు ఇవ్వాలని డిమాండ్
జగనన్న విద్యాదీవెన పథకంపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు. అది ఒక వంచన కార్యక్రమమని విమర్శించారు. తల్లి అకౌంట్లలోకి డబ్బులు వేసి, దాన్ని కాలేజీలకు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఓట్ల కొనుగోళ్లలో ఇది కూడా భాగమా? అని ప్రశ్నించారు. విద్యా దీవెన అనేది ఒక అర్థం లేని ఆలోచన అని అన్నారు. జగనన్న వసతి దీవెన కూడా అందరికీ రావడం లేదని తెలిపారు.
శ్రీకాకుళంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన చేస్తుంటే జనాలు మీద పడుతున్నారని... జగన్ సమావేశాలకు మాత్రం జనం రావడం లేదని రఘురాజు ఎద్దేవా చేశారు. జగన్ సభకు రావాలని, చప్పట్టు కొట్టాలని వైసీపీ నేతలు అడుక్కుంటుండటం సిగ్గు చేటని అన్నారు. వైసీపీ ఓట్ల కుట్రలు ప్రజలకు తెలిసిపోయాయని చెప్పారు. ఇప్పటికైనా విద్యా దీవెనలు తల్లులకు ఇవ్వడం మానేసి, కాలేజీలకు ఇవ్వాలని సూచించారు.