YSRCP: దుగ్గిరాల ఎంపీటీసీ పద్మావతి అదృశ్యంపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే ఆర్కే
- క్యాంపు రాజకీయాల్లో భాగంగానే పద్మావతి అదృశ్యమన్న ఆర్కే
- టీడీపీ ప్రలోభాలపై గతంలో ఆమె కుమారుడు కేసు పెట్టారని వెల్లడి
- టీడీపీ కుట్రల కారణంగానే ఎంపీపీ ఎన్నిక ఆలస్యమైందన్న ఆర్కే
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని దుగ్గిరాల ఎంపీటీసీ పద్మావతి అదృశ్యమై రెండు రోజులు గడుస్తోంది. దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో వైసీపీ రెబల్ అభ్యర్థిగా పద్మావతి బరిలోకి దిగుతున్నారన్న ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన తల్లి పద్మావతిని స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు తమ వెంట తీసుకెళ్లారని యోగేంద్ర నాధ్ బుధవారం నాడు ఆరోపించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఎంపీపీ ఎన్నికలు గురువారం ముగిసిన తర్వాత కూడా పద్మావతి జాడ కనిపించకపోవడంపై ఆమె కుటుంబం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పద్మావతి అదృశ్యంపై ఆళ్ల రామకృష్ణారెడ్డి తాజాగా స్పందించారు.
ఎంపీపీ ఎన్నికల సందర్భంగా క్యాంపు రాజకీయాలు సర్వసాధారణమని చెప్పిన ఆర్కే... అందులో భాగంగానే పద్మావతిని తమ వెంట తీసుకెళ్లినట్లు చెప్పారు. అయినా ఏడాదిన్నర క్రితమే ముగియాల్సిన దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక టీడీపీ వైఖరి కారణంగా వాయిదా పడిందని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతలు తన తల్లిని ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ ఆమె కుమారుడు యోగేంద్ర నాథ్ గతంలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారని ఆయన తెలిపారు.