Rahul Gandhi: ఎన్ఎస్యూఐ నేతలను కలిసేందుకు చంచల్‌గూడ జైలుకు రాహుల్ గాంధీ... అనుమతించాలంటూ జైళ్ల శాఖ డీజీకి రేవంత్ అభ్యర్థన
- ఓయూలో రాహుల్ పర్యటనకు కౌన్సిల్ నిరాకరణ
- కౌన్సిల్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్ఎస్యూఐ నిరసన
- అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన పోలీసులు
- అరెస్టయిన విద్యార్ధి నాయకులను కలిసేందుకు చంచల్‌గూడకు రాహుల్
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు ఈ నెల 7న రానున్నారు. ఈ సందర్భంగా చంచల్‌గూడ జైలులోని పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ నేతలను కలిసే అవకాశాలున్నాయి. చంచల్‌గూడ జైలులోకి రాహుల్ గాంధీని అనుమతించాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం నాడు తెలంగాణ జైళ్ల శాఖ డీజీ జితేందర్‌ను కలిసి ఓ వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు చంచల్‌గూడ్ జైలులోకి రాహుల్‌ను అనుమతించాలని డీజీని రేవంత్ రెడ్డి కోరారు.
ఉస్మానియా విద్యార్థులతో మాట్లాడేందుకు రాహుల్ గాంధీ వర్సిటీకి వస్తారని అనుమతి ఇవ్వాలంటూ ఇదివరకే వర్సిటీ వీసీకి టీపీసీసీ విజ్ఞప్తి చేసింది. అయితే వర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ అందుకు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో కౌన్సిల్ నిర్ణయంపై వర్సిటీలో ఎన్ఎస్యూఐ నేతలు నిరసనకు దిగారు. దీంతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వీరిని కలిసేందుకే రాహుల్ గాంధీ చంచల్‌గూడ జైలుకు వస్తారని, అనుమతించాలని డీజీని రేవంత్ రెడ్డి కోరారు.